ఒక్క చాన్స్‌ అడిగింది ఆస్తులు తాకట్టుకేనా?

ABN , First Publish Date - 2021-10-07T05:39:36+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్క చాన్స్‌ ఇవ్వండి అని ప్రజలను అడిగింది కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకోడానికేనా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మండిపడ్డారు.

ఒక్క చాన్స్‌ అడిగింది ఆస్తులు తాకట్టుకేనా?
మహా ధర్నాలో పాల్గొన్న విష్ణుకుమార్‌రాజు, మాధవ్‌, రవీంద్ర, తదితరులు

సీఎం జగన్‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మండిపాటు

సిరిపురం, అక్టోబరు 6: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్క చాన్స్‌ ఇవ్వండి అని ప్రజలను అడిగింది కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకోడానికేనా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మండిపడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సొంత అజెండా కోసం ప్రజల ఆస్తులను ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు. ముందుగా మీ సొంత ఆస్తులైన ఇడుపులపాయ ఎస్టేట్‌, లోటస్‌పాండ్‌, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌, భారతి సిమెంట్‌, వంటి వాటిని తనఖా పెట్టుకోవాలని సీఎంకు సూచించారు. ఈ తాకట్టు వ్యవహారంలో జరిగిన అన్ని లావాదేవీలపై బ్యాంకు అధికారులతో సహా అందరిపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకువెళ్లిపోతుందన్నారు. భవిష్యత్తులో టిడ్కో ఇళ్లను కూడా తాకట్టు పెడతారేమోనని అనుమానంగా ఉందన్నారు. బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు అప్పులు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్‌వీఎస్‌ ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌.విజయానందరెడ్డి, ఉమ్మడి సుజాత, ఎన్‌.గజపతిరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-07T05:39:36+05:30 IST