తూతూమంత్రం!

ABN , First Publish Date - 2021-12-30T06:00:33+05:30 IST

హిందూ ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక భావ వ్యాప్తికి కృషి చేయాల్సిన సింహాచలం దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరమ పవిత్రంగా భావించే నృసింహ దీక్షల విరమణ కార్యక్రమం రసాభాసగా మారింది.

తూతూమంత్రం!
చందన స్వాముల శోభాయాత్ర

నృసింహ దీక్షల విరమణ ఏర్పాట్లపై సింహాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం

కరోనాను కారణంగా చూపుతూ కొండ కిందనే తతంగం

తొలి పావంచా వద్దే హోమగుండం 

కనీసం స్థల సంప్రోక్షణ చేయని వైనం 

మొక్కుబడిగా శాంతి కళ్యాణం 

భక్తుల ఆగ్రహం

దేవస్థానం అనుసరించిన తీరు మనసును కలచి వేసిందని ఆవేదన


సింహాచలం, డిసెంబరు 29: హిందూ ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక భావ వ్యాప్తికి కృషి చేయాల్సిన సింహాచలం దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరమ పవిత్రంగా భావించే నృసింహ దీక్షల విరమణ కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సింహాద్రి అప్పన్నపై భక్తిభావంతో ఏటా ఎంతోమంది నృసింహ దీక్షలను చేపడుతుంటారు. దేవస్థానం తరఫున వీరికి సహాయ సహకారాలను అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. దీక్షల ప్రారంభం నుంచి విరమణ వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. మండల దీక్షలు పూర్తికావడంతో బుధవారం పెద్దఎత్తున దీక్షధారులు సింహాచలం చేరుకున్నారు. అయితే కొవిడ్‌ను కారణంగా చూపుతూ కొండపై కాకుండా, దిగువన తొలిపావంచా వద్దనే అధికారులు ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమైంది. హోమగుండం, స్వామివారి శాంతి కల్యాణాన్ని కూడా అక్కడే నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఇందుకోసం సిద్ధం చేసిన స్థలాన్ని కనీసం సంప్రోక్షణ చేయలేదని, హిందూ ధర్మానుగుణంగా ఏర్పాట్లు లేవని, మామిడి తోరణాలు, అరటిచెట్లతో శోభాయమానంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దలేదని అధికారులపై భక్తులు మండిపడ్డారు. 


మండలం పాటు పవిత్రంగా, నియమ నిష్టలతో చేపట్టిన నృసింహ దీక్షల విరమణ సమయంలో దేవస్థానం అనుసరించిన తీరు మనసును కలచి వేసిందని, ఏడుపు వస్తోందంటూ 75 ఏళ్ల వృద్ధురాలు బాలమ్మ...ఏఈఓ ఆనందకుమార్‌తో వాదనకు దిగారు. పవిత్రమైన దీక్షల విరమణను సింహగిరిపై కాకుండా, కొండదిగువన అది కూడా అపరిశుభ్ర ప్రదేశంలో...ఏర్పాటుచేయడం దారుణమని కాకినాడ నుంచి వచ్చిన భక్త బృందం ఆవేదన వ్యక్తం చేసింది. తిరుముడుల సమర్పణకు కొండ దిగువనే హోమగుండం ఏర్పాటుచేయడాన్ని అంతా తప్పుబట్టారు. గ్రామదేవత పైడితల్లమ్మ ఆలయానికి వెళ్లి, తిరిగి వచ్చే లోగానే అప్పన్న శాంతి కల్యాణాన్ని ముగించేశారని ఇంకొందరు మండిపడ్డారు. దీక్షల విరమణ సందర్భంగా కల్యాణ వేదిక వద్ద అరటి చెట్లు, మామిడి తోరణాల ఏర్పాటుపైనా శ్రద్ధచూపకపోవడం విమర్శలకు తావిచ్చింది. హిందూ ధర్మ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన దేవస్థానం అధికారులు నృసింహ దీక్షల విషయంలో అనుసరించిన తీరు ఆక్షేపణీయమని బీజేపీ ఆధ్యాత్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణీంద్ర, వీహెచ్‌పీ నేత పూడిపెద్ది శర్మ అసంతృప్తి వ్యక్తంచేశారు.  


అధికారుల వైఫల్యమే: దాడి దేవి, ట్రస్టీ 

వరాహ లక్ష్మీనృసింహస్వామి దీక్షల విరమణ కార్యక్రమం వివాదాస్పదం కావడం బాధాకరమని పాలక మండలి సభ్యురాలు దాడి దేవి అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీక్షల విరమణ సందర్భంగా బుధవారం పలువురు భక్తులు అసంతృప్తితో వెనుతిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన కార్యక్రమానికి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సింహాచల దేవస్థానం పరిధిలో ఇటీవల వివాదాలు పెరుగుతున్నాయని, దీనికి అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమన్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగా ఇప్పటినుంచే పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని సూచించారు.



Updated Date - 2021-12-30T06:00:33+05:30 IST