ఎక్కడి పనులక్కడే!

ABN , First Publish Date - 2021-05-21T05:01:54+05:30 IST

నగరంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కరోనా ప్రభావం పడింది. కర్ఫ్యూ నేపథ్యంలో పనుల వేగం నెమ్మదించింది.

ఎక్కడి పనులక్కడే!
చివరిదశలో ఆగిపోయిన ఎంవీపీలోని హెల్త్‌ఎరీనా

కరోనాతో నిలిచిపోయిన అభివృద్ధి పనులు 

మందకొడిగామరిన్ని నిర్మాణాలు

కర్ఫ్యూతో 12 గంటల వరకే పనులు 

 చివరిదశకు చేరిన ప్రాజెక్టులపైనా ఎఫెక్ట్‌ 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)    

నగరంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కరోనా ప్రభావం పడింది. కర్ఫ్యూ నేపథ్యంలో పనుల వేగం నెమ్మదించింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత జీవీఎంసీ పరిధిలో సుమారు రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.35 కోట్లతో చేపట్టిన వీఎంఆర్‌డీఏ పార్కు అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.పది కోట్లతో జగదాంబ కూడలి వద్ద నిర్మించిన మల్టీలెవెల్‌ కార్‌పార్కింగ్‌ ప్రారంభానికి సిద్ధమయ్యింది. అలాగే స్మార్ట్‌ సిటీలో భాగంగా చారిత్రక భవనాల పరిరక్షణ పేరుతో వన్‌టౌన్‌లోని టౌన్‌హాల్‌, పాత మునిసిపల్‌ కార్యాలయాల అభివృద్ధి, నిరంతర నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణం, ఎంవీపీ కాలనీలో స్పోర్ట్స్‌ ఎరీనా, స్మార్ట్‌ రోడ్ల నిర్మాణం, సోలార్‌ స్ట్రీట్‌ లైటింగ్‌ వంటి పనులు చేపట్టారు. ఇవికాకుండా కాపులుప్పాడలో చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అయితే కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, కర్ఫ్యూ కారణంగా ఈ పనుల్లో వేగం తగ్గింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత రహదారులపై కనిపించకూడదని నిబంధనలు వుండడంతో 11 గంటలకే పనులను నిలిపివేస్తున్నారు. ఇక కొన్ని ఏజెన్సీల కూలీలు, ఉద్యోగులు కరోనా బారినపడడంతో...ఆ ప్రభావం పనులపై పడింది. దీంతో ఆలిండియా రేడియో రోడ్డు, వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌ రోడ్లు నిర్మాణ సామగ్రితో అస్తవ్యస్తంగా మారాయి. ఇదిలావుండగా జీవీఎంసీ పరిధిలో 40 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు టెండర్లు పిలిస్తే 20 భవనాలకు ఒక్క టెండరు కూడా పడలేదు. గెడ్డల్లో పూడికతీతకు సంబంధించి 40 పనులకు టెండర్లు ఆహ్వానించగా 20 పనులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. కరోనాతో పాటు జీవీఎంసీ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. నగరంలో జరుగుతున్న పనులపై ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నిస్తే కొవిడ్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నందున వివరాలు అందుబాటులో లేవంటున్నారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కర్ఫ్యూ ప్రభావం పడిందనేది వాస్తవమేనంటున్నారు.

Updated Date - 2021-05-21T05:01:54+05:30 IST