సంబరాలు కాదు.. బతుకులకు వెలుగునివ్వండి

ABN , First Publish Date - 2021-08-10T06:03:58+05:30 IST

ఆదివాసీ దినోత్సవమని సంబరాలు కాకుండా తమ బతుకులకు వెలుగునివ్వాలని సోమవారం గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు.

సంబరాలు కాదు.. బతుకులకు వెలుగునివ్వండి
అడ్డాకులు ధరించి నిరసన తెలుపుతున్న ఆదివాసీలు

వినూత్నంగా గిరిజనుల నిరసన


రావికమతం, ఆగస్టు 9: ఆదివాసీ దినోత్సవమని సంబరాలు కాకుండా తమ బతుకులకు వెలుగునివ్వాలని సోమవారం గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. గిరిజన సంఘం ఐదో షెడ్యూల్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో జీలుగులోవ, నేరేడుబంద గ్రామాల్లో అడ్డాకులు ధరించి అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా చాలా గిరిజన గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవని, ఇప్పటికీ ఎవరికైనా రోగమొస్తే డోలీమోతలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు మైనింగ్‌ లీజులతో పచ్చని అడవి తల్లిని నాశనం చేస్తూ గిరిజనుల బతుకులను చిన్నాభిన్నం చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులు, నాయకులు ఆదివాసీల పేరుతో సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చీమలపాడు పంచాయతీ గిరిజనలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమం సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సూరిబాబు, గోవిందరావు మాట్లాడుతూ, ఎన్నిమార్లు నిరసనలు తెలుపుతూ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని, పైగా గిరిజనుల సాగు భూములకు ఆటంకం కలిగేలా గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. 

Updated Date - 2021-08-10T06:03:58+05:30 IST