బిల్లులకు భరోసా లేక...!

ABN , First Publish Date - 2021-07-08T05:53:20+05:30 IST

జిల్లాలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

బిల్లులకు భరోసా లేక...!
చోడవరంలో రైతు భరోసా కేంద్రం భవనం పరిస్థితి....

నత్తనడకన ఆర్‌బీకే భవన నిర్మాణాలు

చాలాచోట్ల అర్ధంతరంగా పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

పలుగ్రామాల్లో పునాదుల స్థాయిలోనే...

బిల్లులు మంజూరు కాకపోవడమే కారణం 

జిల్లాలో 630 భవనాలను ఈ నెల 8 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశం

ఇంతవరకు 88 కేంద్రాల భవనాలు మాత్రమే పూర్తి  

కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలదీ ఇదే తీరు


విశాఖపట్నం/చోడవరం, జూలై 7:


జిల్లాలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ భవనాలను జూలై 8వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా...మండలానికి మూడు నాలుగు కేంద్రాల భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 630 రైతు భరోసా కేంద్రాలకుగాను ఇప్పటివరకు 88 భవనాలు మాత్రమే సిద్ధం చేశారు. వీటిని గురువారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


వ్యవసాయానికి సంబంధించి అన్నిరకాల సేవలను ఒకేచోట అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ఏడాదిన్నర క్రితం వ్యవసాయ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల్లో తాత్కాలికంగా వీటిని ప్రారంభించింది. పూర్తిస్థాయిలో వసతి వుండాలన్న ఉద్దేశంతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.22.5 లక్షలు మంజూరుచేసింది. భవనంలో రెండు గదులు, సమావేశ మందిరంతో మొత్తం 1,400 చదరపు అడుగులు వుండేలా నిర్మించాలని ఆదేశించింది. జిల్లాలో 702 రైతు భరోసా కేంద్రాలకు భవనాలు నిర్మించాలని ప్రతిపాదించగా, వివిధ కారణాల వల్ల 630 కేంద్రాల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మందకొడిగా సాగిస్తున్నారు. అయినప్పటికీ రైతు దినోత్సవం నాటికి (జూలై 8వ తేదీ) కనీసం 200 కేంద్రాల భవనాలు అయినా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ 88 భవనాలను మాత్రమే జిల్లా అధికారులు సిద్ధం చేయగలిగారు. వీటిని గురువారం ప్రారంభించడానికి ముస్తాబు చేస్తున్నారు. వాస్తవంగా ఏడాదిన్నర క్రితం ఆర్‌బీకే భవన నిర్మాణ పనులు ప్రారంభించగా, గత ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో చాలా భవనాల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు సత్వరమే బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు పునాదుల స్థాయిలోనే పనులు నిలిపివేశారు.


చోడవరం మండలంలో 28 కేంద్రాలు...మూడు భవనాలు మాత్రమే పూర్తి!


చోడవరం మండలంలో 28 రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను గత ఏడాది ప్రారంభించారు. వీటిల్లో ఇంతవరకు మూడు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు చాలాకాలం క్రితమే ఆగిపోయాయి. కొన్నిచోట్ల శ్లాబ్‌ దశలో ఆగిపోగా, మరికొన్ని భవనాలు పునాదుల్లోనే ఉన్నాయి. చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుపై ఇంజనీరింగ్‌ అధికారులకు సైతం స్పష్టత లేకపోవడంతో పనులు కొనసాగించడానికి కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నట్టు తెలిసింది.


కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలదీ ఇదే పరిస్థితి


జిల్లాలో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. మొత్తం 570 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అధికారులు ప్రతిపాదించగా...తొలి దశలో 170 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. చివరకు 30 కేంద్రాలు మాత్రమే సిద్ధమయ్యాయి. ఆయా కేంద్రాల పరిధిలో రైతులు సంఘంగా ఏర్పడితే రూ.15 లక్షల విలువగల వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తారు. దీనిలో 40 శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీ కింద భరిస్తుండగా, సగం డబ్బును బ్యాంకులు రుణాలుగా సమకూర్చుతాయి. మిగిలిన 10 శాతాన్ని రైతులు భరించాలి. ఈ కేంద్రాల్లో రోటవేటర్లు, చాప్‌కట్టర్లు, కల్టివేటర్లు, పవర్‌ వీడర్లు, పవర్‌ స్ర్పేయర్లు, సీడ్‌ డ్రిల్స్‌, బ్యాటరీ స్ర్పేయర్లు, వరి కోసే యంత్రాలు ఉంటాయి. వీటిని రైతులకు అద్దెకు ఇస్తారు. వచ్చే సొమ్మును బ్యాంకు రుణ బకాయిల కింద చెల్లిస్తారు. అయితే కేంద్రాలకు ఈ పరికరాలు ఇంకా రాలేదు. 


ఆరు అగ్రి ల్యాబ్స్‌ రెడీ


కేంద్రాలకు చేరుకున్న ప్రయోగ పరికరాలు 

నేడు ప్రారంభోత్సవం


విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరుచోట్ల అగ్రి ల్యాబ్‌లను గురువారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున తొమ్మిది అగ్రి ల్యాబ్స్‌తోపాటు సబ్బవరంలో జిల్లా స్థాయి అగ్రిల్యాబ్‌ను ప్రభుత్వం గత ఏడాది మంజూరుచేసింది.  భీమిలి, నర్సీపట్నం, చింతపల్లి, అరకులోయ, చోడవరం, అనకాపల్లిలో అగ్రి ల్యాబ్స్‌ నిర్మాణ పనులు పూర్తికావడంతో గురువారం ప్రారంభించనున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.65 లక్షలు, పరికరాలు, ఇతర సామగ్రికి రూ.20 లక్షలు వెచ్చించారు. సబ్బవరంలోని జిల్లాస్థాయి అగ్రిల్యాబ్‌తోపాటు ఎలమంచిలి, పాయకరావుపేట, మాడుగులలో భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో వాటిని ప్రారంభించడం లేదు. 


ల్యాబ్స్‌కు చేరుకున్న సామగ్రి


ప్రారంభానికి సిద్ధం చేసిన ఆరు అగ్రి ల్యాబ్‌లకు అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, కంప్యూటర్‌, విత్తనాలు పరీక్షించే సీడ్‌ ప్లాంటర్‌, కెమికల్స్‌ భద్రపరిచే గ్లాసులు, ఇతర సామగ్రి చేరుకున్నాయి.  ఎరువులను పరీక్షించడానికి అవసరమైన రసాయనాలను స్థానికంగా కొనుగోలు చేయడానికి ఉన్నతాధికారులు అనుమతించారు. ల్యాబ్‌లో పనిచేసే వ్యవసాయాధికారిని ఎనలిస్టుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో ల్యాబ్‌లో చేసే ప్రతి పరీక్షకు చట్టపరమైన గుర్తింపు వస్తుందని వ్యవసాయ జేడీ లీలావతి తెలిపారు.

Updated Date - 2021-07-08T05:53:20+05:30 IST