నిధుల పంచాయితీ

ABN , First Publish Date - 2021-10-29T06:06:48+05:30 IST

పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నిధుల పంచాయితీ
తుమ్మపాలలో పేరుకుపోయిన చెత్త

14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిల కింద జమ చేసుకున్న ప్రభుత్వం

15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్‌

సర్పంచుల గగ్గోలు

పంచాయతీల నిర్వహణ కోసం అప్పులు 

పనులు చేసి ఇరుక్కున్న వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొంతమంది గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయించారు. అయితే వాటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారు. 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరిట వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం...15వ ఆర్థిక సంఘం నిధులను ఫ్రీజింగ్‌ చేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.

కేంద్రం 14వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి విడత నిధులు కింద జిల్లాకు రూ.58 కోట్లు విడుదల చేసింది.  పంచాయతీ ఖాతాలకు డబ్బులు జమ కావడంతో సర్పంచులు రోడ్లు, డ్రైన్లు నిర్మాణం, మరమ్మతులు చేపట్టవచ్చుననుకున్నారు. కొందరు పనులు కూడా ప్రారంభించారు. అయితే పంచాయతీ ఖాతాల్లో వున్న 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిల పేరిట రాష్ట్ర ప్రభుత్వం  వెనక్కి తీసుకుంది. దీంతో సర్పంచులు షాక్‌ అయ్యారు. విద్యుత్‌ బిల్లుల మేరకు నిధులు వెనక్కి తీసుకోవాలి గానీ మొత్తం తీసేసుకోవడమేమిటని పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు కూడా ఈ విషయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి పంచాయతీల వారీగా బిల్లులు తెప్పిస్తామని, ఒకవేళ పంచాయతీ ఖాతాలో సొమ్ము కంటే విద్యుత్‌ బిల్లు తక్కువగా వుంటే మిగిలిన మొత్తం వెనక్కి ఇప్పిస్తామని వారు భరోసా ఇచ్చినా ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదు. అయితే చాలామంది సర్పంచులు ఇప్పటికే బోర్లు, కొళాయిలు, మోటారు మరమ్మతులు, వీధి దీపాలు, ఇతరత్రా పనులకు ఆయా గ్రామాల జనాభా మేరకు రూ.లక్షల్లో వెచ్చించారు. బ్లీచింగ్‌, కొళాయిలు, చేతి బోర్లు మరమ్మతులకు సంబంధించిన విడిభాగాలు దుకాణాల నుంచి అరువుపై తెచ్చారు. ఇలా ప్రతి సర్పంచ్‌ రూ.రెండు నుంచి నాలుగు లక్షల వరకు అరువు కింద పనిముట్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం బిల్లుల కోసం సర్పంచులపై దుకాణదారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రావడంతో సర్పంచులు సంతోషించారు. అయితే ఈ నిధులపై కూడా ప్రభుత్వ ఫ్రీజింగ్‌ విధించింది. సీఎంఎఫ్‌ఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేసినా...అక్కడ పెండింగ్‌ అని చూపిస్తోంది. అత్యవసర పనుల బిల్లుల మంజూరుకు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారని, మరోవైపు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే పెండింగ్‌ అని చూపిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు మరమ్మతులు, కొత్త పనులు చేయాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని, ఇప్పటికే అందినకాడికి అప్పులు చేశామని, నిధులు లేకుండా తాము ఏం చేయగలమని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

గ్రామానికి ఏదో చేద్దామని సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచా. మా పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో వీధి లైట్లు కొత్తవి ఏర్పాటుచేయడానికి రూ.50 వేలు అరువుపై తీసుకువచ్చాం. కాల్వల్లో పూడిక తీయడానికి రూ.30 వేలు ఖర్చుచేశాం. గ్రామాల్లో రెండు రక్షిత నీటి పథకాలకు సంబంధించిన సంప్‌కు ట్యాప్‌లు వేయడం, మోటారు మరమ్మతుకు రూ.80 వేలు వెచ్చించాం. ఐదుచోట్ల చేతి బోర్లు మరమ్మతులకు రూ.60 వేలు ఖర్చుచేశాం. ప్రస్తుతానికి అరువుపై విడిభాగాలు, లైట్లు తీసుకురాగా మరికొంత సొంత డబ్బులు పెట్టాం. వీటికి సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేశాం. ఇంతవరకు పైసా రాలేదు. బిల్లులు రాకపోతే ఇక నుంచి నిర్వహణ మరింత భారంకానున్నది.

- కర్రి పుష్పా, సర్పంచ్‌, నాగమయ్య పేట,దేవరాపల్లి మండలం



సర్పంచులకు గౌరవ వేతనం విడుదల

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరుచేసింది. మొత్తం ఆరు నెలలకు సంబంఽ దించిన డబ్బులు జనరల్‌ ఫండ్‌ నుంచి సర్పంచుల ఖాతాలకు జమ చేస్తున్నారు. జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచులుగా ఎన్నికైన వారికి నెలకు రూ.3,000 గౌరవ వేతనంగా ఇస్తున్నారు. తొలి త్రైమాసికానికి రూ.8,857 వంతున రూ.85,20,695, రెండో త్రైమాసికానికి రూ.7,636 వం తున రూ.73,48,405... ఆరు నెలలకుగాను రూ.16,493 లు చొప్పున మంజూరుచేశారు. నెలకు మూడు వేలు వంతున ఆరు నెలలకు రూ.18 వేలు గౌరవ వేతనం ఇవ్వాల్సి వున్నప్పటికీ రూ.1,507 కోత వేశారు.

Updated Date - 2021-10-29T06:06:48+05:30 IST