నాడు-నేడు నిధులు బొక్కేశారు!

ABN , First Publish Date - 2021-08-25T05:41:03+05:30 IST

పాఠశాలల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన నాడు-నేడు పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

నాడు-నేడు నిధులు బొక్కేశారు!
బుచ్చెంపేట హైస్కూల్‌లో తలుపులు లేకుండా ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌, లోపల మర్బల్స్‌, రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేని దృశ్యం

చోడవరంలో మాదిరిగానే రోలుగుంట మండలం బుచ్చెంపేట, కొమరవోలు పాఠశాలల్లో నిధులు దుర్వినియోగం

అంచనాకు మించి వెచ్చించినా అసంపూర్ణం

అంతా తూతూమంత్రం

బుచ్చంపేట రూ.43.2 లక్షలు, కొమరవోలులో రూ.18.62 లక్షలు వ్యయం

నాసిరకం సామగ్రి వినియోగం

పాత తలుపులు, కిటికీలకు మెరుగులు

కొత్తగా వేసినట్టు రికార్డులు

కొరవడిన ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ


రోలుగుంట, ఆగస్టు 24: పాఠశాలల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన నాడు-నేడు పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రోలుగుంట మండలం బుచ్చెంపేట, కొమరవోలు పాఠశాలల్లో చేపట్టిన పనులు పరిశీలిస్తే నిధులు స్వాహా జరిగిన విషయం స్పష్టంగా అర్థమవుతోంది.


మండలవ్యాప్తంగా నాడు-నేడు పథకంలో మొదటి విడత 19 పాఠశాలలను ఎంపిక చేశారు. భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేయడం, తరగతి గదులను ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు కల్పన, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు నిర్మించడం, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడం కోసం రూ.3.78 కోట్లు కేటాయించారు. ఈ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. చాలా పాఠశాలల్లో హెచ్‌ఎంలు ఇష్టానుసారంగా పనులు చేపట్టారు. ప్రధానంగా బుచ్చెంపేట ఉన్నత పాఠశాలల్లో, కొమరవోలు ప్రాథమిక పాఠశాలల్లో నిధులను దుర్వినియోగం చేశారు.


బుచ్చెంపేట హైస్కూల్‌లో అంచనాలకు మించి పనులు

బుచ్చెంపేట ఉన్నత పాఠశాలకు రూ.41.54 లక్షలను ప్రభుత్వం మంజూరుచేసింది. వేరే పాఠశాల నిధుల నుంచి అదనంగా రూ.1.78 లక్షలను కేటాయించారు. మొత్తం రూ.43.32 లక్షలతో పనులు చేపట్టారు. వీటిలో రూ.20.59 లక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన ఏజెన్సీలు మెటీరియల్‌ (ఫ్యాన్లు, గ్రీన్‌బ్లాక్‌ బోర్డులు, విద్యార్థులు కూర్చొనే డెస్కులు, వాష్‌ బేసిన్లు, ఇతర సామగ్రి) సరఫరా చేశాయి. మిగిలిన రూ.22.73 లక్షలతో ఇతరత్రా పనులను పాఠశాల హెచ్‌ఎం ఆధ్వర్యంలో చేపట్టారు. ఖాతాలో ఒక్క రూపాయ మిగల్చకుండా ఖర్చు చేసినా పనులు మాత్రం అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. సరికదా! అన్నింటా నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 


మరుగుదొడ్ల కోసం రూ.9.96 లక్షలు వెచ్చించినా అందుకు తగ్గట్టు పనులు లేవు. లోపల టైల్స్‌ వేయలేదు. పైపులైన్లు, తలుపులు ఏర్పాటు చేయలేదు. అలాగే తాగునీటి కోసం రూ.2.82 లక్షలు వెచ్చించినా కనీసం ట్యాప్‌లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మేజర్‌ మైనర్‌ పనులకు సంబంధించి రూ.10.91 లక్షలు ఖర్చు చేసిన్నట్టు చూపించారు. వీటికి అదనంగా తీసుకువచ్చిన నిధులు కూడా సరిపడక అంచాలను పెంచుతున్నట్టు సమాచారం. కాగా, ఈ పాఠశాలలో పనులను గతంలో ఉన్నతాధికారులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారలేదన్న కారణంగా ఇటీవల డీఈవో లింగేశ్వరరెడ్డి హెచ్‌ఎంను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.


కొమరవోలులోనూ అదే తీరు!

కొమరవోలు ప్రాథమిక పాఠశాలలో మొత్తం పనులకు రూ.18.62 లక్షలు మంజూరుచేశారు. ఇందులో మెటీరియర్‌కు 5 లక్షల 54 వేల 982 రూపాయలను మినహాయించి 13 లక్షల 7 వేల 903 రూపాయలను కేటాయించారు. ఈ నిధుల్లో మరుగుదొడ్ల కోసం రూ.4.84 లక్షలు డ్రా చేసి పనులను మమ అనిపించారు. మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌, పైపులు ఏర్పాటు చేయకుండా తూతూమంత్రంగా చేసి చేతులు దులిపేసుకున్నారు. అలాగే తాగునీటి కోసం రూ.1.61 లక్షలు ఖర్చు చేసినా అందుకు తగ్గట్టు పనులు కనిపించడం లేదు. మేజర్‌, మైనింగ్‌ పనులకు సంబంధించి రూ.5.36 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధులతో పాఠశాల భవనాల మరమ్మతు చేపట్టాల్సి వుండగా, పైపై మెరుగులు దిద్దారు. తరగతి గదులకు సంబంధించి కిటికీలు, తలుపులను కనీసం రిపేర్‌ కూడా చేయకుండా పెయింటింగ్‌ వేసి వదిలేశారు. పాఠశాల ముందు ప్రధాన ద్వారం, గేటు కోసం నిధులు డ్రా చేసినా నేటికీ ఏర్పాటు చేయలేదు. అలాగే విద్యుత్‌ పనులు మరీ అధ్వానంగా ఉన్నాయి. వైరింగ్‌, స్విచ్‌ బోర్డు ఏర్పాటు సక్రమంగా లేదు. పాత వైరింగ్‌ను అలాగే వదిలేశారు. నాణ్యతారహిత స్విచ్‌ బోర్డులను ఏర్పాటుచేయడంతో ఇటీవల షార్ట్‌సర్య్కూట్‌ అయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రూ.1.17 వేసిన పెయింటింగ్‌లు అప్పుడే వెలసిపోయాయి. శతశాతం పనులు పూర్తిచేసినట్టు హెచ్‌ఎం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో 50 శాతానికి మించి జరగలేదని స్థానిక నాయకులు తెలిపారు.

Updated Date - 2021-08-25T05:41:03+05:30 IST