ఉక్కు పరిరక్షణకు ఎంపీలు రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2021-08-03T06:08:31+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలోని ఎంపీలంతా రాజీనామాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలోని ఎంపీలంతా రాజీనామాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు మద్దతుగా మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన కార్పొరేటర్ల దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ శిబిరంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
కేంద్రం పునరాలోచించాలి: మంత్రి ముత్తంశెట్టి
ఈ శిబిరానికి రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న జేఏసీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ విశాఖ నగరానికి ఉక్కు పరిశ్రమ పెద్ద దిక్కు లాంటిదని, దాన్ని కోల్పోవడాన్ని ఇక్కడి ప్రజలు అంగీకరించరన్నారు. దీక్షలో వైసీపీ, సీపీఐ, సీపీఎంకు చెందిన కార్పొరేటర్లు గంగరామ్, స్టాలిన్, బెహరా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షకు జనసేన, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు.