సొమ్ము కేంద్రానిది..పెత్తనం రాష్ట్రానిదా!

ABN , First Publish Date - 2021-11-26T06:26:17+05:30 IST

వివిధ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభు త్వం వెనక్కి తీసుకోవడంతో ఆయా పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. నిధులులేక కనీస నిర్వహణ కూడా భారంగా మారుతోందన్న వాదన విని పిస్తోంది.

సొమ్ము కేంద్రానిది..పెత్తనం రాష్ట్రానిదా!


 17 పంచాయతీల ఖాతాల నుంచి15వ ఆర్థిక సంఘం నిధులు లాగేసిన వైసీపీ సర్కారు

 లబోదిబోమంటున్న  సర్పంచులు 

 అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలని ఆందోళన

పాయకరావుపేట, నవంబరు 25 : వివిధ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభు త్వం వెనక్కి తీసుకోవడంతో ఆయా పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. నిధులులేక కనీస నిర్వహణ కూడా భారంగా మారుతోందన్న వాదన విని పిస్తోంది. మండలంలో 17 పంచాయతీల ఖాతాల్లో ఇటీవల జమైన 15వ ఆర్థిక సంఘం నిధులు  రూ.1.17 కోట్లను  సీసీ చార్జెస్‌ పేరుతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో  ఈ నిధులు వస్తా యని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేద్దామన్న తలంపులో ఉన్న ఆయా సర్పంచ్‌లు నివ్వెరపోయారు. మండలంలోని గోపాలపట్నం పంచాయతీ ఖాతాలో రూ.6.1 లక్షలు తగ్గిపోగా, సత్యవరంలో రూ.5.6 లక్షలు ఇలా.. మొత్తం 17 పంచాయతీల్లోనూ నిధులు గణనీయంగా తగ్గిపోవడంతో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఎస్‌.నర్సాపురం పంచాయతీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీ చార్జెస్‌ పేరుతో ఏకంగా రూ.14 లక్షలను తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు రూ.1.77లక్షలు సీసీ చార్జీల పేరుతో తిరిగి తీసుకుంది. దీంతో పం చాయతీ ఖాతాలో కనీస నిల్వ కూడా లేక సర్పంచ్‌ ఇప్పటి వరకు పంచాయతీకి ఖర్చుచేసిన దానికి బిల్లులు మంజూరయ్యే పరిస్థితిలేదు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. సర్పంచ్‌లకు కనీస సమాచారం లేకుండా, పంచాయతీ తీర్మానాలు కూడా లేకుండా పంచాయతీ సొమ్ములు తీసుకోవడం శోచనీయమంటున్నారు. పంచాయతీల్లో నిధుల్లేకుండా పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీల నుంచి తీసుకున్న నిధులను వెంటనే తిరిగి జమచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో పంచాయతీలు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. 

ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. ఏమిటిది?

 - మంచాల అనిత, సర్పంచ్‌, ఎస్‌.నర్సాపురం

ఎస్‌.నర్సాపురం పంచాయతీలో ఇప్పటి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సుమారు రూ.7 లక్షల వరకు రావాల్సి ఉంది. పంచాయతీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులు తీసేసుకోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ఎస్‌.నర్సాపురం పంచాయతీ నుంచి తీసుకున్న నిధులను వెంటనే తిరిగి జమచేయాలి.


Updated Date - 2021-11-26T06:26:17+05:30 IST