MLC రేస్‌.. ఈ ఐదుగురిలో YS Jagan ఎవరికి చాన్స్ ఇస్తారో..!?

ABN , First Publish Date - 2021-10-07T06:29:05+05:30 IST

ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై..

MLC రేస్‌.. ఈ ఐదుగురిలో YS Jagan ఎవరికి చాన్స్ ఇస్తారో..!?

  • స్థానిక కోటాలో రెండు స్థానాలకు త్వరలో నోటిఫికేషన్‌
  • భారీగా ఆశావహులు
  • జాబితాలో దాడి వీరభద్రరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, సీతారామరాజు సుధాకర్‌, డీవీ సూర్యనారాయణరాజు
  • ప్రయత్నాల్లో మరికొందరు
  • అవకాశం ఎవరికి దక్కేనో...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై అధికార పార్టీ వైసీపీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో  జిల్లా నుంచి ఎంపికైన పప్పల చలపతిరావు, బుద్ధ నాగజగదీశ్వరరావుల పదవీ కాలం ఇప్పటికే పూర్తయిపోయింది. వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ అవకాశాలు వుండడంతో ఆశావహులు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ పదవికి అధినాయకుడి నుంచి హామీ పొందినట్టు పలువురు ప్రచారం చేసుకుంటున్నారు. వారిలో వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఒకరు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో వైసీపీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు లభించలేదు. జీవీఎంసీ మేయర్‌ పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చారు. ఆ పదవి కోసమే ఆయన జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఊహించని విధంగా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ గొలగాని వెంకట హరికుమారికి ఆ పదవి ఇచ్చేశారు. ఆ సమయంలో తీవ్ర ఆవేదన చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ కుటుంబంతో సహా వెళ్లి సీఎం జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. దాంతో ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆశలు పెట్టుకున్నారు.


దాడికి అవకాశం?

ఒక స్థానానికి సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు పేరు పరిశీలనలో వున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్‌ అనకాపల్లి పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు. వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు గతంలో పలు పదవులు ఆఫర్‌ చేసినప్పటికీ సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వీరభద్రరావుకు లేదా రత్నాకర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొచ్చునని అధికార పార్టీ నేతలు అంటున్నారు. 


వరుదు కల్యాణిపై తీవ్ర వ్యతిరేకత

శ్రీకాకుళం జిల్లాలో పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన వరుదు కల్యాణికి ఇక్కడి కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే...పార్టీలోని అన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. ఆ సామాజిక వర్గం అసలు విశాఖపట్నం జిల్లాలోనే లేదని, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా తక్కువ సంఖ్యలో వున్నారని చెబుతున్నారు. పైగా ఆమె విశాఖపట్నానికి ఏమి చేశారని, పదవి ఇస్తారని ఆ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఆ జిల్లాలో ధర్మాన సోదరులు వ్యతిరేకిస్తే...ఇక్కడికి తెచ్చి తమపై రుద్దుతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఇక్కడ కోటాలో పదవి ఇస్తే...వ్యతిరేకత తప్పదని గట్టిగా చెబుతున్నారు.


బ్రాహ్మణ కోటాలో... 

ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ వున్న సీతారామరాజు సుధాకర్‌ వైసీపీకి చాలాకాలంగా తెర వెనుక పనిచేస్తున్నారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇద్దామని పార్టీ అధినేత జగన్‌ చాలాసార్లు పార్టీ నాయకులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వడంతో స్వీకరించడానికి తొలుత ఆయన నిరాకరించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ అని చెప్పి, కార్పొరేషన్‌ పదవి ఇస్తారా? అనే తన అసంతృప్తిని ఇతర నాయకుల ద్వారా అధినేత దృష్టికి తీసుకువెళ్లగా, ‘ముందు ఇది తీసుకుంటేనే...తరువాత అది. లేదంటే ఏదీ ఉండదు.’ అనే  సందేశం పంపడంతో తప్పనిసరి స్థితిలో ఆయన చైర్మన్‌ పదవి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో బ్రాహ్మణ సామాజిక వర్గం పెద్దసంఖ్యలో ఉన్నారని, తెన్నేటి విశ్వనాథం, ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామ్మూర్తి, డీవీ సుబ్బారావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇంకా చాలా మంది నేతలు కీలక పదవులు చేపట్టారని, ఆ వర్గానికి న్యాయం చేయాలంటే...సుధాకర్‌కు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆ వర్గం ఒత్తిడి పెడుతోంది.


క్షత్రియ వర్గంలో..

జిల్లాలో క్షత్రియ సామాజికవర్గం బాగానే ఉంది. కోటవురట్లకు చెందిన తంగేడు రాజులు సాగి వంశీయులు కీలకమైన పదవులు నిర్వహించారు. ఆ కుటుంబానికి దగ్గర బంధువైన డీవీ సూర్యనారాయణరాజు గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను ఆయన కోరుతున్నారు. అయితే విజయనగరం జిల్లాలో సాంబశివరాజు కుమారుడు సురేశ్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఇవ్వడంతో ఇక్కడ మరో క్షత్రియునికి పదవి ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మదిలో ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాల్సిందే.

Updated Date - 2021-10-07T06:29:05+05:30 IST