ఎమ్మెల్యే బాబూరావుకు స్వల్ప గాయం

ABN , First Publish Date - 2021-07-12T05:40:14+05:30 IST

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కంటి కింద, ముక్కు పక్కన అతి సూక్ష్మమైన గాయమైంది.

ఎమ్మెల్యే బాబూరావుకు స్వల్ప గాయం
కంటి కింద స్వల్పగాయం కావడంతో ప్లాస్టర్‌ వేసుకుని సమీక్షకు హాజరైన ఎమ్మెల్యే

 

  పార్టీలో చేరికల సందర్భంగా బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు

  ఎమ్మెల్యే కంటి కింద తగిలిన నిప్పురవ్వలు 

 విశాఖలోని కంటి ఆస్పత్రిలో చికిత్సలు

ఎస్‌.రాయవరం, జూలై 11 : పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కంటి కింద, ముక్కు పక్కన అతి సూక్ష్మమైన గాయమైంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. ఎస్‌.రాయవరం మండలం కొరుప్రోలు క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే శనివారం ఉదయం వచ్చారు. పాయకరావుపేట మండలం నుంచి ఇతర పార్టీలకు చెందిన కొందర్ని వైసీపీలో చేర్చేందుకు అక్కడికి ఆ పార్టీ నాయకులు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా పేల్చగా, ఎమ్మెల్యే ముఖానికి తారా జువ్వ నిప్పురవ్వలు తగిలాయి. దీంతో ఆయన కంటి కింద, ముక్కు పక్కన అతి సూక్ష్మమైన గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం అదే రోజు మధ్యాహ్నం పాయకరావుపేటలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమీక్షకు హాజరయ్యారు.  అనంతరం ఆయన విశాఖపట్నం వెళ్లిపోయారు. కంటి భాగంలో కాస్త నొప్పిగా ఉండడంతో ఆదివారం విశాఖ ఐ ఆస్పత్రికి వైద్య పరీక్షలు నిమిత్తం వెళ్లినట్టు ఎమ్మెల్యే  బాబూరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తన కంటికి ఏమీ కాలేదని, సోమవారం కూడా మరోసారి ఆస్పత్రికి వెళ్తానని, ఆ తరువాత నియోజకవర్గానికి వస్తానని చెప్పారు.

Updated Date - 2021-07-12T05:40:14+05:30 IST