మిన్నంటిన నూకతాత సంబరం

ABN , First Publish Date - 2021-03-14T06:18:40+05:30 IST

మండలంలోని రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాల్లో గంగపుత్రులు తమ ఇలవేల్పు దైవం నూకతాత పండుగను శనివారం ఘనంగా జరుపుకున్నారు.

మిన్నంటిన నూకతాత సంబరం
రాజయ్యపేటలో భక్తులపై నుంచి నడిచి వెళ్తున్న పూజారి రాజయ్యపేట, బోయపాడుల్లో ఘనంగా నిర్వహణ

  ‘సపం’లో భాగంగా భక్తులపై నుంచి నడిచి వెళ్లిన పూజారులు

  వేలాది మంది భక్తులు రాక 

 కిక్కిరిసిపోయిన రహదారులు 


నక్కపల్లి, మార్చి 13: మండలంలోని రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాల్లో గంగపుత్రులు తమ ఇలవేల్పు దైవం నూకతాత పండుగను శనివారం  ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజయ్యపేట, బోయపాడు సముద్రతీరాల్లో నూకతాత, నూకాలమ్మ, దుర్గాలమ్మ, సత్తెమ్మతల్లి, గంగమ్మతల్లి, సీతారా ముల దేవతామూర్తులకు పుణ్యస్నానాలు జరిపించారు.  తీరం ఒడ్డున వందల సంఖ్యలో మత్స్యకారులు దేవతామూర్తుల ఆశీస్సుల పొందేందుకు పోటీపడ్డారు. అనంతరం తీరం నుంచి మేళతాళాలతో భారీ ఊరేగింపుగా  గ్రామంలోకి ప్రవేశించారు. దాదాపుగా రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డుపై మత్స్యకారులతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన అనేక భక్తులు నూకతాత ఆశీస్సులు పొందేందుకు తహతహలాడారు. ముందుగానే తమ వెంట తెచ్చుకున్న వస్ర్తాలను రోడ్డుపై పరిచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంబరం జరిగింది. వందలాది మంది భక్తులు, మహిళలు నేలపై వుండగా, వారిపై నుంచి పూజారులు నడిచివెళ్లారు. ఈ ఘట్టాన్నే  మత్స్యకారులంతా సపం అంటారు. ఇలా పూజారులు తమపై నుంచి నడిచి వెళ్తే ఏడాది పొడవునా ఆరోగ్యంతో పాటు సుఖసంతోషాలతో ఉంటారని వారి నమ్మకం. విద్యుద్దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు భారీ ఏర్పాట్లు చేపట్టారు. 

Updated Date - 2021-03-14T06:18:40+05:30 IST