యాదవులకు రాజకీయంగా గుర్తింపు అవసరం
ABN , First Publish Date - 2021-10-28T06:09:03+05:30 IST
రాష్ట్ర జనాభాలో 18 శాతం కలిగిన యాదవులకు రాజకీయపరమైన గుర్తింపు అవసరమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ అన్నారు.

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాములుయాదవ్
చోడవరం, అక్టోబరు 27: రాష్ట్ర జనాభాలో 18 శాతం కలిగిన యాదవులకు రాజకీయపరమైన గుర్తింపు అవసరమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ అన్నారు. స్థానిక ఫంక్షన్ హాలులో బుధవారం జరిగిన చోడవరం, మాడుగుల నియోజకవర్గాల యాదవ వంశీయుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై ప్రసంగించారు. యాదవులకు రావాల్సినంత గుర్తింపు లభించడం లేదని, వారికి అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. యాదవుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, యాదవుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో సినీ నటి కరాటే కల్యాణి యాదవ్ మాట్లాడుతూ, యాదవుల సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. యాదవులు ప్రతి ఒక్కరూ చదువులో రాణించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లాలో యాదవులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన డీసీఎంఎస్ చైర్‌పర్సన్ గొలగాని చినతల్లి, విశాఖ నగర నాయకులు వంశీకృష్ణ, గొలగాని హరి, యాదవ వంశ సంఘం నాయకులు నమ్మి అప్పలరాజు, పినబోయిన అప్పారావు, సానబోయిన గోవింద్, మొల్లి ప్రసాద్, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల యాదవులు పాల్గొన్నారు.