కరిగిపోతున్న కొండ

ABN , First Publish Date - 2021-03-23T05:04:02+05:30 IST

నరవలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వందల ఎకరాల కొండవాలు ప్రాంతం ఉంది.

కరిగిపోతున్న కొండ
విశాఖ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం ఇదే

నరవలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు

ఫిర్యాదులు అందితే తప్ప స్పందించని గనుల శాఖ అధికారులు

తూతూ మంత్రంగా పరిశీలన.. నామమాత్రంగా చర్యలు


గోపాలపట్నం, మార్చి 22: నరవలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వందల ఎకరాల కొండవాలు ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్న వ్యాపారులు కొంతమేర అనుమతులు తీసుకుని మిగతా ప్రాంతాల్లో కూడా అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతం అగాధంలా మారింది. గతంలో దీనిపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో గనుల శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. అనుమతులు నిలిపివేశారు. అయితే ప్రస్తుతం ఇదే గ్రామంలోని సర్వే నంబర్‌ 4 లో కొంత మేర గ్రావెల్‌ తవ్వకాలకు గనుల శాఖ అనుమతి ఇచ్చింది. కాగా స్థానిక విశాఖ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని సర్వే నంబర్‌ 29లో గల సుమారు 30 ఎకరాల భూమిలో భారీగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకపోయినా నిరాటంకంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. 


అంతా రాత్రి వేళల్లోనే..

గత రెండున్నర దశాబ్దాలుగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొంత కాలం పాటు అక్రమార్కులు కాస్త వెనుకడుగు వేసినా గత ఆరు నెలల నుంచి మళ్లీ విజృంభిస్తున్నారు. స్థానిక విశాఖ ఇంజనీరింగ్‌ కళాశాలకు సమీపంలో రాత్రి వేళలో అక్రమంగా తవ్వకాలు చేపట్టి గ్రావెల్‌ తరలిస్తున్నారు. కళాశాల సమీపంలోని జీడితోటల్లో ఎక్సకవేటర్లను ఉంచి రాత్రి వేళల్లో దర్జాగా తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామంలోని అన్ని సరిహద్దుల్లో తమ మనుషులను కాపలాగా ఉంచి నిరాటంకంగా తవ్వకాలు చేపడుతున్నారు. 

గనుల శాఖ పర్యవేక్షణ లేక..

నరవలో అక్రమ క్వారీ తవ్వకాలు చేపడుతున్న విషయం దాదాపుగా అన్ని శాఖల అఽధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కుల మధ్య వివాదాలు తలెత్తి గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే తవ్వకాలు చేపట్టిన చోట మాత్రమే అధికారులు పరిశీలించి వెళ్లిపోతున్నారని, మిగతా ప్రాంతాల్లో పరిశీలించడం లేదని చెబుతున్నారు. 

Updated Date - 2021-03-23T05:04:02+05:30 IST