ఆక్సిజన్ బెడ్ల పెంపునకు చర్యలు
ABN , First Publish Date - 2021-05-06T05:27:44+05:30 IST
ఎన్టీఆర్ వైద్యాలయంలో ఆక్సిజన్ బెడ్ల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి టౌన్, మే 5: ఎన్టీఆర్ వైద్యాలయంలో ఆక్సిజన్ బెడ్ల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రింగురోడ్డులోని ఓ కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యాలయంలో 50 వరకు ఆక్సిజన్ బెడ్లు, మరో 35 మామూలు బెడ్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన బెడ్లకు కూడా తన సొంత నిధులతో ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో 250 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పాక్షిక కర్ఫ్యూను ప్రజలంతా పాటించాలని సూచించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగంతో కలిసి ప్రజల కోసం పనిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమీక్షలో ఆర్డీవో జె.సీతారామారావు, జోనల్ కమిషనర్ పి.శ్రీరామ్మూర్తి, వైద్యాధికారి తిరుపతిరావు డిప్యూటీ తహసీల్దార్ వెంకట్, సీఐలు ఎల్.భాస్కరరావు, సీహెచ్.ప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రవికుమార్, కశింకోట డిప్యూటీ తహసీల్దార్ శేషు, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, కొణతాల భాస్కరరావు, గొర్లి సూరిబాబు పాల్గొన్నారు.