‘ఉక్కు’ ప్రైవేటీకరణపై రేపు భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-07-09T05:23:16+05:30 IST

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరంచేందుకు చర్యలను వేగవంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న నగరంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్టు విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

‘ఉక్కు’ ప్రైవేటీకరణపై రేపు భారీ ర్యాలీ
రాస్తారోకోలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నాయకులు

కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాసారోకో చేసిన అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నాయకులు

సిరిపురం, జూలై 8: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరంచేందుకు చర్యలను వేగవంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న నగరంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్టు విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం పరిరక్షణ కమిటీ సమావేశం రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.నాయినబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ‘ఉక్కు’ ప్రైవేటీకరణకు లీగల్‌ అడ్వైజర్‌, ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్ల నియామకానికి బిడ్లు ఆహ్వానించడం ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిని నిరసిస్తూ పదో తేదీ ఉదయం పది గంటలకు సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జీవీఎంసీ వద్ద సభ జరగుతుందని, దీనికి అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


జీవీఎంసీ వద్ద రాస్తారోకో..

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ మాట్లాడుతూ దేశ సంపదను మోదీ అనుకూల కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఎం.మన్మధరావు, కె.ఈశ్వరరావు, కనకరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-09T05:23:16+05:30 IST