మరణంలోనూ వీడని స్నేహబంధం

ABN , First Publish Date - 2021-03-22T06:17:31+05:30 IST

ఆ ముగ్గురూ ప్రాణస్నేహితులు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు.

మరణంలోనూ వీడని స్నేహబంధం
సంఘటనా స్థలం వద్ద పడి వున్న బైక్‌, మృతదేహం

బలంగా చెట్టుని ఢీకొనడంతో దుర్ఘటన

ఒకరి ఇంట్లో ఫంక్షన్‌... ఏర్పాట్లలో సాయానికి వచ్చిన స్నేహితులు 

అర్ధరాత్రి దాటాక బహిర్భూమికి వెళుతుండగా ప్రమాదం

బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరే మగసంతానం

దుఃఖసాగరంలో తల్లిదండ్రులు, కుటుంబీకులు

మాకవరపాలెంలో విషాదఛాయలు



మాకవరపాలెం, మార్చి 21:

ఆ ముగ్గురూ ప్రాణస్నేహితులు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఒకరి ఇంట్లో ఆదివారం ఫంక్షన్‌ వుండడంతో, పనుల్లో చేదుడువాదోడుగా వుండడానికి మిగిలిన ఇద్దరూ మిత్రుని ఇంటికి వచ్చారు. రాత్రి వరకు అక్కడే వున్నారు. అర్ధరాత్రి తరువాత బహిర్భూమికని ఊరు శివార్లలో వున్న నది వద్దకు బైక్‌పై బయలుదేరారు. దారిలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురూ మృతిచెందారు.  మాకవరపాలెంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన మూడు కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు....

మాకవరపాలెం గ్రామానికి చెందిన రుత్తల హేమంత్‌ సాయి(15), పహాడి హర్షిత్‌ (15), పహాడి అనీష్‌కుమార్‌ (15) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. హేమంత్‌ సాయి ఇంట్లో ఆదివారం  ఫంక్షన్‌ వుండడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనుల్లో హేమంత్‌ సాయికి... అతని స్నేహితులైన హర్షిత్‌, అనీష్‌కుమార్‌ సహకరిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట ప్రాంతంలో బహిర్భూమికని సమీపంలోని సర్పా నది వద్దకు ముగ్గురూ కలిసి బైక్‌పై వెళ్లారు. అర్ధరాత్రి రెండు గంటలు అయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో హర్షిత్‌ తండ్రి శేషుకుమార్‌ బైక్‌పై హేమంత్‌సాయి ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ నిద్రపోతుండడంతో వెతుకులాట మొదలుపెట్టారు. గ్రామానికి శివారులో పీపీఅగ్రహారం వెళ్లే రోడ్డులో బైక్‌తోపాటు ముగ్గురూ తీవ్రగాయాలపై రోడ్డుపక్కన పడిపోయి కనిపించారు. వెంటనే హేమంత్‌ సాయి తండ్రికి, తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. వారంతా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. హేమంత్‌ సాయి అప్పటికే మృతిచెందాడు. మిగిలిన ఇద్దరూ కొనఊపిరితో ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా హర్షిత్‌ దారిలోనే చనిపోయాడు. అనీష్‌కుమార్‌కు ప్రాథమిక వైద్యం చేసి, విశాఖపట్నం తరిలిస్తుండగా దారిలో ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు... ఆదివారం ఉదయం ముగ్గురి మృతదేహాలను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు.

బైక్‌ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు విద్యార్థులు... ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరే మగ సంతానం. హేమంత్‌సాయి తల్లిదండ్రులు రుత్తల ఈశ్వరరావు, లక్ష్మి...  టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె వున్నారు.హర్షిత్‌ తండ్రి శేషగిరిరావు సెల్‌టవర్స్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఇంటర్‌ చదువుతున్న కుమార్తె వున్నారు. అనీష్‌కుమార్‌ తండ్రి సపత్‌కుమార్‌ అన్‌రాక్‌ కంపెనీలో కార్మికునిగా పని చేస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లల తరువాత కుమారుడు పుట్టడంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఒకేఒక్క ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపడంతోపాటు కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ముగ్గురు విద్యార్థుల మృతితో మాకవరపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2021-03-22T06:17:31+05:30 IST