రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-09T05:08:57+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఆనందపురం, మే 8: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గరివిడి సమీపంలోని నీలాద్రిపురానికి చెందిన ఎ.భానుప్రకాశ్ అనే వ్యక్తి విశాఖలోని సాగర్‌నగర్‌లో కుక్కల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా నీలాద్రిపురంలో తన పిన్ని మృతి చెందడంతో చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఆనందపురం మండలంలోని గంభీరం ఐటీ సెజ్ దరికి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ దాటుకుని ద్విచక్ర వాహనంపై వెళుతున్న భానుప్రకాశ్‌ను ఢీకొనడంతో విజయనగరం వైపు వెళుతున్న మారుతీ వ్యాన్‌కు, కారుకి మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న ఒకరికి, వ్యాన్‌లో ఒకరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ఆనందపురం ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సీఐ వై.రవి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.