మహా నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-04-30T05:34:57+05:30 IST
కొవిడ్-19పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా కీర్తింపబడుతున్న పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది ప్రాణాలకు ఇప్పుడు భద్రత కరువైంది.
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కొరవడిన రక్షణ
కరోనాతో వారం రోజుల్లో
ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు,
ఒక శానిటరీ సూపర్‌వైజర్ మృతి
తీవ్ర ఆందోళనలో జీవీఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కొవిడ్-19పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా కీర్తింపబడుతున్న పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది ప్రాణాలకు ఇప్పుడు భద్రత కరువైంది. విధినిర్వహణలో తగిన రక్షణ సామగ్రిని సమకూర్చకపోవడంతో వైరస్ బారినపడి గత నాలుగు రోజుల్లో మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మృతిచెందారు.
కరోనా కారణంగా జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వారం కిందట ఒక శానిటరీ సూపర్‌వైజర్, నాలుగు రోజులు కిందట ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, బుధవారం 15వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.మోహనరావు కరోనాతో మృతిచెందారు. ఇంకా పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడ్డారు. తాజా పరిణమాలతో విధులు నిర్వర్తించాలంటే పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది భయపడిపోతున్నారు. మొదటివేవ్ కంటే సెకండ్‌వేవ్ తీవ్రంగా వున్నప్పటికీ అధికారులు తగిన భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందువల్లే కరోనా బారినపడుతున్నవారితోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోందనే విమర్శ ఆ విభాగం నుంచి వినిపిస్తోంది. మొదటి వేవ్‌లో ఎవరికైనా కరోనా సోకితే ఆ సమాచారం సంబంధిత వార్డు సచివాలయం సిబ్బందికి చేరేది. దీంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమై బాధితుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, హోం ఐసోలేషన్‌లో ఉంటే...ప్రతిరోజూ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేసేవారు. అంతేకాకుండా బాధితుడి ఇంటితోపాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్, బ్లీచింగ్ పిచికారీ చేసేవారు. దీంతో ఆ ప్రాంతంలో చెత్తను సేకరించేటప్పుడు పారిశుధ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటుండేవారు. సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, బెటాడిన్ గార్లింగ్ లిక్విడ్ ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించేశారు. గతంలో మాదిరిగా పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించిన సమాచారం వార్డు సచివాలయాలకు చేరకపోవడం, పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసాలు, పరిసరాల్లో సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పిచికారీ జరగకపోవడంతో సిబ్బందికి ఎటువంటి వివరాలు తెలియడం లేదు. పాజిటివ్ వచ్చినవారు కూడా సాధారణ వ్యక్తులతోపాటు పాటే వచ్చి చెత్తను సిబ్బందికి ఇస్తున్నారు. సిబ్బంది కూడా వాటిని చేతులతో తీసుకుని వాహనాల్లో వేసేస్తున్నారు. దీంతో వారికి వైరస్ సోకుతోంది. అయితే అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ చెత్తసేకరణ ఆగిపోతే నగరంలో పారిశుధ్య సమస్యలు తలెత్తుతాయనే భావనతో బయటకు చెప్పడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ వీవీ వామనరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 15 మంది వరకూ ఉద్యోగులు కొవిడ్‌తో మృతిచెందారన్నారు. జీవీఎంసీ పరిధిలోని ఫంక్షన్‌హాళ్లు, పార్కులు, ఇతర భవనాలను కొవిడ్ సెంటర్లుగా మార్చి సిబ్బందికి, ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ జి.సృజనను కోరారు. జీవీఎంసీ గుర్తింపు సంఘం నేత ఎం.ఆనందరావు తాజా పరిణామంపై మాట్లాడుతూ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.
వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే ప్రాణాపాయం తప్పేదేమో...
కరోనా కారణంగా మృతిచెందిన ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక శానిటరీ సూపర్‌వైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకుని వుంటే ప్రాణాపాయం తప్పివుండేదేమోనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి వారందరికీ ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించింది. అయితే చాలామంది అపోహలు, అనవసర భయాలతో వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇటీవల మృతిచెందిన నలుగురు కూడా ఇదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనుకంజ వేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకుని వుంటే కరోనా సోకినప్పటికీ ప్రాణాపాయం వుండేది కాదని అభిప్రాయపడుతున్నారు.