మాఘ పౌర్ణమికి తీరాలు ముస్తాబు

ABN , First Publish Date - 2021-02-26T05:54:37+05:30 IST

సుందర తీరం రేవుపోలవరంలో మాఘ పౌర్ణమికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మాఘ పౌర్ణమికి తీరాలు ముస్తాబు
రేవుపోలవరం తీరం


 ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం, అచ్యుతాపురం మండలం పూడిమడక, రాంబిల్లి మండలం వాడపాలెంలలో భారీ ఏర్పాట్లు

  పూడిమడకలో రేపు జాతర 

నేటి సాయంత్రం నుంచి భక్తులు భారీగా తరలి రాక 

 రాత్రికి జాగరణ 

 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ 

 భారీ పోలీస్‌ బందోబస్తుకు సన్నాహాలు 


 ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 25 : సుందర తీరం రేవుపోలవరంలో మాఘ పౌర్ణమికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ శనివారం మాఘపౌర్ణమి కావడంతో ఆ రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో తరలి వస్తారు. ఎస్‌.రాయవరం మండలంలో గల ఈ తీరం సహజసిద్ధమైన ప్రకృతి రమణీయ అందాలతో  అలరారుతుంటుంది. ఎత్తైన కొండపై లక్ష్మీమాధవస్వామి ఆలయం ఉండగా, కొండరాళ్లను అలలు స్పృశించే దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. సముద్రస్నానాల అనంతరం కొండపై ఉన్న లక్ష్మీమాధవస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  సీఐ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. 


పూడిమడక తీరంలో..

అచ్యుతాపురం: మాఘపౌర్ణమి సందర్భంగా పూడిమడక జాతరకు ముస్తాబైంది. శనివారం ఇక్కడ  భారీ స్థాయిలో జాతర జరగనుంది.  జిల్లా నలుమూలల నుంచి అతి భారీ సంఖ్యలో భక్తులు శుక్రవారం సాయంత్రం నుంచే పూడిమడకకు తరలి వస్తారు. రాత్రి జాగరణ చేసి, శనివారం ఉదయం తీరంలో ఉన్న సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథస్వామి, రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు.  శుక్రవారం రాత్రి తీరంలో  భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఇదిలావుంటే, శుక్రవారం ఉదయం పది గంటల నుంచి అనకాపల్లి డిపోనుంచి 40 అదనపు బస్సులు పూడిమడకకు నడుపుతున్నామని డిపో మేనేజర్‌ ఎస్‌. గిరిధర కుమార్‌ తెలిపారు.  భారీ స్థాయిలో పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు వివరించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులంతా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

  వాడపాలెం తీరంలో...

రాంబిల్లి : ఇక్కడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గల వాడపాలెం సముద్ర తీరంలో మాఘ పౌర్ణమికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం తీరాన్ని ఆనుకొని ఉన్న గంగాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. తీరంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ తెలిపారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. 


Updated Date - 2021-02-26T05:54:37+05:30 IST