దేవుడి పేరుతో దగా?

ABN , First Publish Date - 2021-07-24T06:12:40+05:30 IST

మండలంలోని మడుతూరులో స్థానిక నాయకులు దేవుడ్ని కూడా తమ అవసరాలకు వాడుకుంటున్నారు.

దేవుడి పేరుతో దగా?
కొండ వద్ద ఎక్సకవేటర్‌తో గ్రావెల్‌ తవ్వుతున్న దృశ్యం

 మడుతూరు వద్ద గల బోడుకొండపై స్థానిక నాయకులు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు!  

 వరుణ దేవుడి ఆలయానికి మెట్లు కోసమని ప్రచారం

ఇష్టారాజ్యంగా తరలిస్తూ విక్రయాలు 

 కన్నెత్తి చూడని అధికారులు

అచ్యుతాపురం, జూలై 23 : మండలంలోని మడుతూరులో స్థానిక నాయకులు దేవుడ్ని కూడా తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఎవరికి అందిన కాడికి వారు దోచేసుకుంటున్నారు. బడా నాయకులు ప్రభుత్వ భూముల్ని రియల్టర్లకు విక్రయిస్తుంటే.. గ్రామస్థాయి చోటా నాయకులు తమకు అందుబాటులో ఉన్న గ్రావెల్‌ను పట్టపగలు అక్రమంగా తవ్వుకుంటూ.. కాసులు కూడబెట్టుకుంటున్నారు. మడుతూరు గ్రామాన్ని ఆనుకొని ఉన్న బోడుకొండపై వరుణ దేవుని ఆలయం ఉంది. ఈ కొండ ప్రాంతమంతా చక్కని గ్రావెల్‌ ఉంది. దీంతో స్థానిక నాయకుల దృష్టి ఈ గ్రావెల్‌పై పడింది. నేరుగా తవ్వితే ఆటంకాలు ఎదురవుతాయని భావించి, వరుణ దేవుడ్ని వాడుకున్నారు. కొండపై ఉన్న వరుణ దేవుని ఆలయానికి మెట్లు నిర్మిస్తున్నామని చెప్పి రెండు రోజుల నుంచి ఎక్సకవేటర్లు, ట్రాక్టర్ల ద్వారా భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. దేవుని గుడికి మెట్లు నిర్మించేందుకు ఇంత స్థాయిలో ఇక్కడ గ్రావెల్‌ తవ్వనవసరం లేదు. కానీ సదరు నాయకులు ఆ పేరుతో గ్రావెల్‌ని తవ్వి అమ్ముకుంటున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిర్మించాల్సిన రోడ్డు పనులకు సైతం ఈ గ్రావెల్‌ను వేసేస్తున్నారు. మడుతూరు గ్రామాన్ని ఆనుకొని సెజ్‌లో కర్మాగారాలు ఉన్నాయి వాటికి కూడా గ్రావెల్‌ను విక్రయిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇంత బహిరంగంగా ఈ తంతు జరుగుతున్నా కన్నెత్తి చూసేవారు కరువయ్యారని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. 

Updated Date - 2021-07-24T06:12:40+05:30 IST