హోటల్స్‌పై పిడుగు

ABN , First Publish Date - 2021-05-03T04:52:04+05:30 IST

హోటల్‌ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వైరస్‌ భయంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు

హోటల్స్‌పై పిడుగు
కరోనా కారణంగా మూసివేసినట్టు బోర్డు పెట్టిన హోటల్‌ కామత్‌

తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెకెండ్‌ వేవ్‌ 

నగరవాసుల్లో ఇంటి భోజనంపై పెరిగిన ఆసక్తి

సిబ్బందిని వెంటాడుతున్న వైరస్‌, లాక్‌డౌన్‌ భయం

20 శాతానికి పడిపోయిన వ్యాపారం

నష్టాలతో నడపలేక మూసివే స్తున్న నిర్వహకులు


  (విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి)

హోటల్‌ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వైరస్‌ భయంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. రోగనిరోధకశక్తిని వృద్ధి చేసుకునేందుకు ఇంటి భోజనంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో హోటళ్లకు కస్టమర్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో 20 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుండడంతో నష్టాలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా సిబ్బందిని లాక్‌డౌన్‌, వైరస్‌ భయం వెంటాడుతుండడంతో  సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పదుల సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. 

పర్యాటక, పారిశ్రామికంగా, విద్యాపరంగా ప్రధాన నగరంగా విశాఖ గుర్తింపు పొందింది. దీంతో ప్రతి రోజూ లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తుంటారు. నగరవాసులు కూడా ఇంటి కెళ్లి భోజనం చేసే సమయంలేక హోటళ్లనే ఆశ్రయిస్తుంటారు. దీంతో నగరంలో హోటళ్లకు డిమాండ్‌ ఎక్కువ. నగరంలో రెస్టారెంట్‌లు, చిన్నా పెద్దా హోటళ్లు  సుమారు వెయ్యి వరకూ ఉన్నాయి. వీటలో దాదాపుగా లక్ష మంది హౌస్‌ కీపింగ్‌, కిచెన్‌, సర్వీసింగ్‌, బిల్లింగ్‌, రిసెప్షన్‌, సెక్యూరిటీ వంటి విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం కిందటివరకూ ఈ వ్యాపారం లాభదాయకంగా సాగింది. గత ఏడాది లాక్‌డౌన్‌తో ఈ రంగానికి కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా హోటల్‌లో భోజనం చేసేందుకు చాలామందిలో భయం నెలకొంది. అన్‌లాక్‌ తర్వాత హోటళ్లను తిరిగి తెరిచినా చాలాకాలం నష్టాలతోనే నడిచాయి. గత ఏడాది డిసెంబర్‌ నాటికి కేసులు తగ్గిపోవడంతో తిరిగి హోటళ్లకు తాకిడి పెరిగింది. ఇంతలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభం, మరణాలు కూడా పెరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు సాహసించడంలేదు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుండడంతో ఇంట్లో ఆహారానికే ఆసక్తి చూపుతున్నారు. దీనిప్రభావం హోటళ్లపై పడింది. జనవరి, ఫిబ్రవరిలో జరిగిన వ్యాపారంలో 20 శాతం కూడా ప్రస్తుతం జరగకపోవడంతో నిర్వాహకులకు భారంగా పరిణమించింది. కరోనా తీవ్రత మరికొంత కాలం ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో  నష్టాలతో వ్యాపారం సాగించడం కంటే తాత్కాలికంగా మూసివేయాయమే ఉత్తతమని భావిస్తున్నారు. 


 పదుల సంఖ్యలో మూత 

నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం, వ్యాపారం లేకపోవడంతో ప్రతిరోజూ పదుల సంఖ్యలో హోటళ్లను మూసివేస్తున్నారు. ఇప్పటికే సుమారు వందకిపైగా హోటళ్లు మూతపడినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నారంటున్నారు. తాజాగా డైమండ్‌పార్కు సమీపంలోని ఒక హోటల్‌ , ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని మరో హోటల్‌, బీచ్‌రోడ్డులోని లాసెన్స్‌బే కాలనీలోని ఇంకో హోటల్‌తోపాటు మధ్య తరహాలోని మరో పది హోటళ్లను మూసివేశారు. దీనికితోడు హోటళ్లలో పనిచేసేవారిలో అత్యధికంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందినవారే ఉంటారు. మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో వీరంతా తమ ఊళ్లకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల సిబ్బంది లేక మరికొన్ని హోటళ్లను మూతపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈనెలాఖరుకి నగరంలో 90 శాతం  హోటళ్లు మూసివేయడం ఖాయమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.


కరోనా దెబ్బతీసింది

కరోనా రూపంలో హోటల్‌ రంగంపై పిడుగు పడింది. గత ఏడాది లాక్‌డౌన్‌తో చాలామంది వ్యాపారం వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని సంతోషించే సమయానికి సెకండ్‌వేవ్‌ రూపంలో ఉపద్రవం ముంచుకొచ్చింది. 20 శాతం కూడా వ్యాపారాలు జరగకపోవడంతో చాలామంది హోటళ్లను మూసేస్తున్నారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో ఉన్నారు. హోటల్‌ పరిశ్రమ భవిష్యత్తులో కూడా కోలుకోలేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 

- తాళ్లూరి సత్యనారాయణ, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 


Updated Date - 2021-05-03T04:52:04+05:30 IST