ముడసర్లోవ పార్కును ప్రైవేటుకు ఇస్తే ఒప్పుకోం

ABN , First Publish Date - 2021-05-30T05:47:48+05:30 IST

ముడసర్లోవ పార్కును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పేరుతో ప్రైవేటుకు అప్పగిస్తే అంగీకరించమని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగడిపూడి రామకృష్ణబాబు ప్రకటించారు.

ముడసర్లోవ పార్కును ప్రైవేటుకు ఇస్తే ఒప్పుకోం

తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): ముడసర్లోవ పార్కును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పేరుతో ప్రైవేటుకు అప్పగిస్తే అంగీకరించమని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగడిపూడి రామకృష్ణబాబు ప్రకటించారు. ఆయన శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముడసర్లోవ పార్కు అభివృద్ధిపై 2018 నుంచి చర్యలు మొదలయ్యాయని వివరించారు. జీవీఎంసీకి చెందిన ఈ పార్కును వీఎంఆర్‌డీఏ నిధులతో అభివృద్ధి చేయాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన డిజైన్‌ అకార్డ్‌ సంస్థతో డిజైన్‌, డీపీఆర్‌ తయారు చేయించారని, దీనికి రూ.50.4 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు. ఇందులో మొదట దశ పనులను చేపట్టడానికి 10.8.2018న జరిగిన  వుడా బోర్డు మీటింగ్‌లో రూ.19 కోట్లకు ఆమోదం కూడా లభించిందన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో పనులు ముందుకు వెళ్లలేదన్నారు. వీఎంఆర్‌డీఏ వెనక్కి తగ్గడంతో ఆ ఫైల్‌ మొత్తం 13 నవంబరు, 2020 జీవీఎంసీకి అప్పగించారన్నారు. ఈ పార్కును అభివృద్ధి చేయాలని గత నెలలో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్‌లో 5వ అంశంగా చేర్చారని, రూ.50 కోట్లతో అభివృద్ధి చేయడానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ను ఆహ్వానిస్తున్నామని చెబితే.. కౌన్సిల్‌ మొత్తం వ్యతిరేకించిందన్నారు. అయితే డీపీఆర్‌ తయారు చేస్తామని చెప్పి చర్చ ముగించారన్నారు. ప్రజలు ఎన్నుకున్న వంద మంది సభ్యులు గల కౌన్సిల్‌ వద్దని చెప్పిన అంశంపై ఎంపీగా విజయ సాయిరెడ్డి ఎలా ముందుకు తీసుకెళతారని ప్రశ్నించారు. ఈ పార్కును పరిశీలనకు వెళుతున్నపుడు జీవీఎంసీ కమిషనర్‌ సృజన ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని ఎమ్మెల్యే వెలగపూడి ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు, మేయరుకు, స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. నగరంలో వీఎంఆర్‌డీఏ సిటీ సెంట్రల్‌ పార్కు, బీచ్‌ రోడ్డులో వుడా పార్కు, అప్పుఘర్‌ దగ్గర లుంబిని పార్కు, తెన్నేటి పార్కు ఇలా అన్నింటిని వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలే అభివృద్ధి చేశాయని, ఎక్కడా ప్రైవేటు సంస్థలకు ఇవ్వలేదని గుర్తుచేశారు. ముడసర్లోవలో మంచినీటి రిజర్వాయర్‌ ఉందని, అందులో ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయని, గత ఏడాదే రూ.50 లక్షలతో పనులు చేయించామన్నారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే.. రిజర్వాయరు దెబ్బతినడంతో పాటు అక్కడి భూములు కూడా చేతులు మారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. పార్కును అభివృద్ధి చేయమని తామూ కోరుతున్నామని, ప్రైవేటుకు వద్దని మాత్రమే చెబుతున్నామన్నారు. 


Updated Date - 2021-05-30T05:47:48+05:30 IST