ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు

ABN , First Publish Date - 2021-07-12T05:50:28+05:30 IST

దేశంలోని ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయని శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు
దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న బాలసుబ్రహ్మణ్యం

శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం

సిరిపురం, జూలై 11: దేశంలోని ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయని శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షలు ఆదివారం నాటికి 101వ రోజుకు చేరాయి. ఈ దీక్ష శిబిరానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షాబుజ్జి వచ్చి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు దీక్షలు చేపట్టిన విశాఖ కార్మిక వర్గానికి, వివిధ ప్రజా సంఘాల నాయకులకు జేజేలు పలుకుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా దానిని శాసన మండలికి పంపలేదన్నారు. ఎందుకు పంపలేదని అడిగితే అందులో బీజేపీ ఎమ్మెల్సీలున్నారని, వారి మనసును నొప్పించడం సరికాదని పంపలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల పోరాటానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలమంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-12T05:50:28+05:30 IST