కలెక్టరేట్‌లో కాకులు మృతి

ABN , First Publish Date - 2021-01-12T05:53:28+05:30 IST

బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో గల పోస్టాఫీసు వద్ద ఐదు కాకులు మృతిచెంది కనిపించడంతో కలకలం రేగింది.

కలెక్టరేట్‌లో కాకులు మృతి
విశాఖ కలెక్టరేట్‌ ఆవరణలో చనిపోయిన కాకులు

ఇన్‌ఫెక్షన్‌తో మృతి చెందినట్టు పోస్టుమార్టంలో నిర్ధారణ

బర్డ్‌ ఫ్లూ కాదన్న వైద్యులు


విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో గల పోస్టాఫీసు వద్ద ఐదు కాకులు మృతిచెంది కనిపించడంతో కలకలం రేగింది. అదే ప్రాంతంలో మరొకటి కొన ఊపిరితో ఉంది. పోస్టాఫీస్‌కు వచ్చిన వారంతా చనిపోయిన కాకులను చూసి పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.రామకృష్ణ నేతృత్వంలో వైద్యులు కరుణాకరరావు, నాగమణి అక్కడకు చేరుకుని కాకులను పరిశీలించారు. ఆయాసం, నోరుతెరిచి ఉంచడం, డయేరియా లక్షణాలు వుంటే బర్డ్‌ఫ్లూగా నిర్ధారిస్తామని, అయితే అటువంటివి లేవని డాక్టర్‌ రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అనంతరం జేడీ సూచనలతో చనిపోయిన కాకులతోపాటు కొనఊపిరితో వున్న కాకిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు. చనిపోయిన కాకులకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈలోగా ఆ కాకి మృతిచెందింది. బర్డ్‌ప్లూ లక్షణాలు లేవని, ఇన్‌ఫెక్షన్‌తో మృతిచెందాయని పోస్టుమార్టంలో తేలినట్టు డాక్టర్‌ నాగమణి తెలిపారు.  


పక్షులు మృతిచెందితే సమాచారం ఇవ్వండి

జిల్లాలో ఎక్కడైనా పక్షులు మృతి చెందినట్టు తెలిస్తే వెంటనే తమ కార్యాలయానికి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని జాయింట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ తెలిపారు. కోళ్లఫారాల యజమానులను బర్డ్‌ఫ్లూ వైరస్‌పై అప్రమత్తంగా వుండాలని, బయట వ్యక్తులను ఫారాల్లోకి అనుమతించవద్దని సూచించారు.

Updated Date - 2021-01-12T05:53:28+05:30 IST