ప్రభుత్వ జాగాలో పాగా
ABN , First Publish Date - 2021-03-21T06:28:27+05:30 IST
అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమణకు గురవుతోంది.

అచ్చియ్యపేటలో భూ ఆక్రమణ
ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు సెంట్లు ఆక్రమణ
తొలుత పశువుల పాకలు ఏర్పాటు...ఆ తరువాత పక్కా ఇళ్ల నిర్మాణం
అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల అండదండలు
కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.50 వేలు వసూలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
అనకాపల్లి/కొత్తూరు, మార్చి 20:
అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమణకు గురవుతోంది. ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు సెంట్ల వరకు ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చాలాకాలంగా ఈ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు గ్రామానికి వెళ్లి మొక్కుబడిగా రెండు కమ్మలు లాగేసి, ఆక్రమణలు తొలగించినట్టు ప్రకటిస్తున్నారు. పక్కా భవనాల జోలికి మాత్రం వెళ్లడం లేదు.
అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేటలో ఇళ్ల స్థలాలకు గిరాకీ ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు లక్ష రూపాయలు పలుకుతున్నది. దీంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములు, స్థలాలపై పడింది. సర్వే నంబర్ 523/1లోని సుమారు 9.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ తరహాలోనే కబ్జాకు గురవుతోంది. స్థానికులు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు సెంట్ల వరకు సెట్లు ఆక్రమించుకున్నారు. తొలుత పశువులపాకలు...కొద్దిరోజుల తరువాత పూరిళ్లు వేస్తున్నారు. మరికొంతకాలం తరువాత పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే మూడొంతులకుపైగా ఆక్రమణకు గురైంది.
రాజకీయ అండదండలు
అచ్చియ్యపేటలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి రాజకీయంగా అండదండలు వున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఆక్రమిత స్థలాల్లో పక్కా ఇళ్లను తొలగించడానికి గతంలో ఒక తహసీల్దార్ చర్యలు చేపట్టారని, వారం తిరక్కుండానే ఆయన బదిలీ అయ్యారని గుర్తుచేస్తున్నారు. ఆక్రమణదారులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, పక్కా ఇంటి నిర్మాణం చేపట్టిన వారి నుంచి కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. దీంతో ఆక్రమణలదారుల జోలికి వెళ్లడానికి సాహసం చేయకపోతున్నామని రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి చెబుతున్నారు.
సెంటు రూ.లక్ష!
అచ్చియ్యపేటలోని సర్వే నంబరు 523/1లో వున్న ప్రభుత్వ భూమికి ఆనుకొని సుమారు 30 ఏళ్ల క్రితం కాలనీ ఏర్పడింది. రహదారి పక్కనే వుండడంతో ఇక్కడ భూములు, ఇళ్ల స్థలాలకు గిరాకీ ఎక్కువ. ప్రస్తుతం సెంటు లక్ష రూపాయలు పలుకుతోంది. ఈ ప్రకారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి విలువ ఐదారు కోట్ల రూపాయలు వుంటుందని అంచనా.
కబ్జాదారులను ఉపేక్షించం
ఎ.శ్రీనివాసరావు, తహసీల్దార్, అనకాపల్లి
సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేటలోని 523/1లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత వీఆర్‌వో, ఆర్‌ఐలకు చెప్పాను. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాను. ఎల్‌పీసీలు ఇచ్చినట్టయితే...వాటిని పరిశీలిస్తాం. వాస్తవ లబ్ధిదారుడు అయితే సరే. లేకపోతే చర్యలు తీసుకుంటాం.
ఆక్రమణదారులను ఉపేక్షించం
జె.సీతారామారావు, ఆర్డీవో, అనకాపల్లి
సుందరయ్యపేట పంచాయతీలోని అచ్చియ్యపేటలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేస్తాను. ఆక్రమణలు వున్నట్టు గుర్తిస్తే తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.