కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వైద్యాధికారులకు సూచించారు.

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వైద్యాధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో కొవిడ్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, రోజువారీ పరీక్షల నిర్వహణ, సిబ్బంది, డేటా ఎంట్రీ, పరీక్షల ఫలితాలను వెల్లడించడం, కొవిడ్‌ నిర్ధారణ అయిన వారికి వైద్యం, ఆస్పత్రుల్లో పడకలు, కిట్స్‌, మందుల లభ్యత, పీపీఈ కిట్స్‌, శానిటైజర్లు, మాస్క్‌లు మొదలైన అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్‌, శానిటైజర్‌, భౌతికదూరంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. 45 ఏళ్లు దాటి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విమ్స్‌, కేజీహెచ్‌ (సీఎస్‌ఆర్‌ బ్లాకు)లో కలిపి 900 పడకలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులను, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యాఽధికారులను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణకు సూచించారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో పరీక్షల నిర్వహణ, బెడ్స్‌ వివరాలను సేకరించాలన్నారు. కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు ఐసోలేటెడ్‌ వార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్‌ చేయాలని, మాస్క్‌ లేకుండా బయటకు వచ్చేవారికి శిక్ష విధించే విషయంపై ఆలోచన చేయాలన్నారు. సమావేశంలో ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ జీవన్‌రాణి తదితరులు పాల్గొన్నారు. 




కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 61,067కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 60,237 మంది కోలుకోగా, మరో 290 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కొవిడ్‌ బారినపడి 540 మంది మృతి చెందారు. 

7,648 మందికి వ్యాక్సిన్‌.. 
జిల్లాలో 7,648 మందికి సోమవారం వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీరిలో 6,916 మంది మొదటి డోసు, 732 మంది రెండో డోసు  తీసుకున్నారు. 

Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST