ఆస్పత్రుల ఆస్తులపైనా కన్ను!?
ABN , First Publish Date - 2021-11-26T05:53:16+05:30 IST
ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.

వైద్య, ఆరోగ్య శాఖ ఆస్తులపై ఆరా..!
నగర, గ్రామీణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆస్తులు వివరాలు పంపాలంటూ ఆదేశాలు
జిల్లాలో సుమారు వేయి ఎకరాలకు పైగా ఉంటాయని అంచనా
అప్పు కోసం తనఖా పెట్టేందుకేనని అనుమానాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల ఆస్తులను కుదవబెట్టేం దుకు సిద్ధమైన సర్కారు...తాజాగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆస్తులు వివరాలను సేకరిస్తోంది. జిల్లాలో కేజీహెచ్, విమ్స్‌తోపాటు బోధనాస్పత్రుల ఆస్తుల గురించి అధికారులను అడిగినట్టు తెలిసింది. అదేవిధంగా గ్రామీణ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు చెందిన ఆస్తులు వివరాలను కూడా పంపాల్సిందిగా ఆదేశించింది. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నాయి. ముఖ్యంగా నగర పరిధిలోని కేజీహెచ్, విమ్స్, ఛాతీ, అంటువ్యాధులు, ఈఎన్‌టీ ఆస్పత్రులకు చెందిన భూముల విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిపై ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందేందుకు అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.
కోట్లాది రూపాయలు విలువ..
జిల్లాలో ఆస్పత్రులకు సంబంధించిన ఆస్తులు, వాటి విస్తీర్ణం, సర్వే నంబర్ల వివరాలు అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. నగర పరిధిలోని విమ్స్, ఆంధ్రా మెడికల్ కళాశాల, ఈఎన్‌టీ, మానసిక వైద్యశాల, ఘోషా ఆస్పత్రులకు 300 ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. వీటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది.
ఇవీ ఆస్తులు..
కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాల 52 ఎకరాల విస్తీర్ణంలో, చి నవాల్తేరులోని ఆర్‌సీడీ ఆస్పత్రి 32 ఎకరాల్లో, మానసిక వైద్యశాల, ఛాతీ, అంటువ్యాధులు, ఈఎన్‌టీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రులు 60 ఎకరాలలో, వీజీహెచ్ 5, విమ్స్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటితోపాటు గ్రామీణ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు భూములు భారీగా ఉన్నాయి. ఒక్క వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన భూము లు వెయ్యి ఎకరాలకు పైగానే వుంటాయని భావిస్తున్నారు. ఇం దులో ఏ మేరకు వినియోగంలో ఉంది?, ఎంత ఖాళీగా ఉంది?...అనే వివరాలను సమగ్రంగా సర్వే నంబర్లతో సహా పంపించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది.