జెల్లీ ఫిష్‌ కలకలం

ABN , First Publish Date - 2021-11-09T06:30:07+05:30 IST

జెల్లీ ఫిష్‌. చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ చాలా ప్రమాదకరమైనది. రెండు దశాబ్దాల క్రితం విశాఖపట్నంలో ఈ పేరు బాగా వినిపించింది.

జెల్లీ ఫిష్‌ కలకలం

రుషికొండ సమీపాన కనిపిస్తున్నాయంటున్న స్కూబా డైవర్స్‌ 

వాతావరణం మార్పుతో ఆహారం కోసం రాక

పసుపు రంగులో ఉండేవి అంత ప్రమాకరం కాదు

నీలం రంగులో, పెద్దవి అయితే జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన

 అవి కుడితే నాడీ వ్యవస్థ అచేతనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జెల్లీ ఫిష్‌. చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ చాలా ప్రమాదకరమైనది. రెండు దశాబ్దాల క్రితం విశాఖపట్నంలో ఈ పేరు బాగా వినిపించింది. అప్పట్లో యారాడ సమీపాన సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు వీటి బారినపడి చనిపోయారు. జెల్లీ ఫిష్‌ తల పుట్టగొడుగులా ఉంటుంది. పదుల సంఖ్యలో పొడవాటి తోకలు (టెంటికల్స్‌) ఉంటాయి. వాటి సాయంతోనే అది ఆహారం తీసుకుంటుంది. ఆ తోకల చివర (స్టింగ్‌) ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఆపద కలిగించే ప్రాణి ఏదైనా సమీపానికి వచ్చినట్టనిపిస్తే...స్టింగ్‌తో కుడుతుంది. చిన్న జెల్లీ ఫిష్‌లో ఆ విషం తక్కువ పరిణామంలో ఉంటుంది. అందువల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. అదే పెద్ద సైజులో వుండే జెల్లీ ఫిష్‌ అయితే ఆ విషానికి విరుగుడు కూడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి జెల్లీ ఫిష్‌లు ఇప్పుడు రుషికొండ తీరానికి దగ్గరలో తరచూ  కనిపిస్తున్నాయంటున్నారు. పర్యాటకంగా ఎదుగుతున్న ఆ ప్రాంతంలో కొన్ని బృందాలు స్కూబా డైవింగ్‌ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు శిక్షణ కూడా ఇస్తున్నాయి. తీరానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ ఐదు నుంచి పది మీటర్ల లోతున డైవింగ్‌ చేస్తున్నారు. ఈ బృందానికి కొద్దిరోజులుగా జెల్లీ ఫిష్‌లు తారసపడుతున్నాయి. స్కూబా డైవింగ్‌ నిపుణుడు బలరామ్‌నాయుడు వాటిని వీడియో కూడా తీశారు. పసుపు రంగులో వున్న అవి తమ వైపు రావడం చూసి పక్కకు తప్పుకున్నామని, ఆ రకం మరీ అంత ప్రమాదకరం కావని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఒక్కోసారి వాటి టెంటికల్స్‌ శరీరాన్ని తాకితే...దురదగుంటాకు రాసుకుంటే ఎలా ఉంటుందో...అలా మంట పుడుతుందని, సిట్రిక్‌ యాసిడ్‌ లేదా వెనిగర్‌ వంటివి రాసుకుంటే కొద్దిసేపటికి ఆ మంట తగ్గుతుందని వివరించారు. సాధారణంగా వాటికి మనుషులపై దాడి చేసే అలవాటు లేదని వివరించారు. 


వాతావరణం మార్పు వల్లే వస్తుంటాయి

డాక్టర్‌ డీఈ బాబు, ఏయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, జువాలజీ

వాతావరణం మారి, సముద్ర ఉపరితలం చల్లగా ఉన్నప్పుడు ‘ప్లాంటాన్‌’ (చిన్న చిన్న మొక్కలు, చేపల గుడ్లు, అప్పుడే పుట్టిన చేప పిల్లలు) తీరానికి దగ్గరగా, సముద్రంపైకి వస్తాయి. వాటికి అవసరమైన కార్బన్‌ డయాక్సైడ్‌ కోసం అవి వస్తే, వాటిని తినడానికి జెల్లీ ఫిష్‌లు వస్తాయి. అలాంటి క్రమంలో అవి డైవర్స్‌కు కనిపిస్తుంటాయి. పెద్దపెద్ద అలలు వచ్చినప్పుడు కూడా జెల్లీ ఫిష్‌లు తీరానికి కొట్టుకువస్తాయి. ఆ అలలు వెనక్కి వెళ్లినప్పుడు తిరిగి వాటితో వెళ్లలేక ఇసుకలో ఉండిపోతాయి. ఆ విధంగాను అప్పుడపుడు బీచ్‌లో అవి కనిపిస్తుంటాయి. అయితే నీలం రంగులో, పెద్దగా ఉండేవి అయితే బాగా ప్రమాదకరం. అవి కుడితే నాడీ వ్యవస్థ అచేతనమైపోతుంది. ఆ విషానికి మందు కూడా లేదు. అటువంటివి మన తీరంలో కనిపించడం చాలా అరుదు. రుషికొండ నుంచి భీమిలి వరకు అటు ముత్యాలమ్మపాలెం వంటి ప్రాంతాల్లో కనిపించేవి అంత ప్రమాదకరం కాదు. 


గుంపులుగా సంచరించేవి కావు

బలరామ్‌నాయుడు, స్కూబా డైవర్‌

చాలాకాలంగా సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేస్తున్నాము. సాధారణంగా సముద్రంలో ఏవైనా చేపలు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఈ జెల్లీ ఫిష్‌ మాత్రం ఒకటి, రెండు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తున్నాయి. అవి టెంటికల్స్‌ సాయంతోనే ముందుకు నెమ్మగా కదులుతాయి. అవి మన వైపు వస్తున్నాయని గమనించిప్పుడు తప్పించుకోవడం చాలా సులువు. ఇప్పటివరకు మా బృందంలో ఎవరికీ వాటి వల్ల ఇబ్బంది ఎదురుకాలేదు.


కనిపిస్తే తాబేళ్లు వదలవు

తెడ్డు శంకరరావు, మత్స్యకారుడు, పెదజాలరిపేట

జెల్లీ ఫిష్‌ చాలా ప్రమాదకరం. అవి ఒంటికి తగిలితే దద్దుర్లు వచ్చేస్తాయి. చారలు ఏర్పడతాయి. వీటిని తాబేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. మాకు వేటలో ప్రమాదం కలిగించే ఇలాంటి చేపలను తాబేళ్లు తినేసి రక్షిస్తాయి కాబట్టి తాబేళ్లను మేము పూజిస్తుంటాము. పెద్ద పెద్ద సముద్రం తాబేళ్లు వలకు చిక్కినా వెంటనే తీసి మళ్లీ వదిలేస్తాం. 

Updated Date - 2021-11-09T06:30:07+05:30 IST