జనావాసాల్లో దుకాణం

ABN , First Publish Date - 2021-08-21T05:45:45+05:30 IST

విక్రయాలు తక్కువగా ఉన్నాయని వన్‌టౌన్‌లోని ఒక మద్యం దుకాణాన్ని ఈ నెల నాలుగో తేదీన జ్ఞానాపురం మెయిన్‌రోడ్డుకు మార్చారు.

జనావాసాల్లో దుకాణం
ఆరిలోవ శాంతినగర్‌కు కొత్తగా మార్చిన దుకాణం

గిరాకీ ఎక్కడుంటే అక్కడే మద్యం షాపు ఏర్పాటు

విక్రయాలు తక్కువగా ఉన్నచోట నుంచి తరలింపు

ఆదాయం పెంపు కోసం ఎక్సైజ్‌ అధికారుల ఎత్తుగడ

ఆందోళనకు దిగుతున్న మహిళలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విక్రయాలు తక్కువగా ఉన్నాయని వన్‌టౌన్‌లోని ఒక మద్యం దుకాణాన్ని ఈ నెల నాలుగో తేదీన జ్ఞానాపురం మెయిన్‌రోడ్డుకు మార్చారు. అక్కడ దుకాణం వల్ల తమ ప్రాంతంలో ఇబ్బందులు మొదలయ్యాయంటూ మహిళలు ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి వేరొకచోటకు తరలించారు. తాజాగా ఆరిలోవ లాస్ట్‌ బస్టాప్‌ వద్ద వున్న మద్యం దుకాణాన్ని కొద్దిదూరంలో గల శాంతినగర్‌కు మార్చారు. ఇళ్ల మధ్యలో దుకాణాన్ని ప్రారంభించడంతో మహిళలు  ఆందోళనకు దిగారు.

రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ మేరకు ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశాలు జారీచేయడంతో దుకాణాల మార్పిడి  మొదలైంది. మొదట దుకాణాల వారీగా విక్రయాలను లెక్కించిన అధికారులు, అంతకంటే ఎక్కువగా విక్రయాలు జరిగేందుకు అవకాశం వున్న ప్రాంతాలపై దృష్టిపెట్టారు. కూలీలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో అయితే విక్రయాలు మరింత పెరుగుతాయని నిర్ధారణకు వచ్చిన అధికారులు... ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. తక్కువ విక్రయాలు జరుగుతున్న దుకాణాలను అక్కడి నుంచి ఎక్కువ విక్రయాలు జరిగేందుకు అవకాశం వున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే ప్రాంతంలో దుకాణానికి అవసరమైన భవనం కోసం అధికార పార్టీకి చెందిన వారిని సంప్రతిస్తున్నారు. ఈనెల నాలుగున జ్ఞానాపురం మెయిన్‌రోడ్డులో కొత్తగా మద్యం దుకాణం ప్రారంభించారు. గతంలో అక్కడున్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ ఆ ప్రాంతంలోని మహిళలు, యువత 116 రోజులపాటు ఆందోళన నిర్వహించారు. తప్పనిసరి పరిస్థితిలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు అక్కడ దుకాణం ఏర్పాటుచేయలేదు. అయితే అక్కడ భారీగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం వుండడంతో ఈ నెల నాలుగున నగరంలో మరోచోట వున్న దుకాణాన్ని తొలగించి...అదేచోట ఏర్పాటుచేశారు. దీనిపై మహిళలు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుచేయడం సరికాదని, దానివల్ల తమ ప్రాంతంలో నేరాలు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో అధికారులు తప్పనిసరి పరిస్థితిలో అక్కడి నుంచి దుకాణాన్ని మరొకచోటకు మార్చేసుకున్నారు. తాజాగా ఆరిలోవ ఆఖరి బస్టాప్‌లో వున్న మద్యం దుకాణంలో విక్రయాలు బాగానే జరుగుతున్నప్పటికీ, శాంతినగర్‌లో అయితే మరింత పెరుగుతాయని అధికారులు భావించారు. అనుకున్నదే తడవుగా శాంతినగర్‌లో శుక్రవారం ప్రారంభించారు. విషయం తెలిసిన స్థానిక మహిళలు వరలక్ష్మీ పూజ పూర్తికాగానే మద్యం దుకాణం వద్దకు చేరుకుని తమ ప్రాంతంలో వద్దంటూ ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం ఏర్పాటుచేసిన భవనం స్థానిక వైసీపీ నేతది కావడంతో మొదట్లో మహిళలు వెనక్కి తగ్గినప్పటికీ, తర్వాత ఒక్కొక్కరుగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ నోడల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ వద్ద ప్రస్తావించగా ఆరిలోవ ఆఖరి బస్టాప్‌ వద్ద నివాసాలు ఎక్కువగా వుండడంతో శాంతినగర్‌కు మార్చామని తెలిపారు. విక్రయాలతో సంబంధం లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వుండడమే ప్రధానమని వివరించారు.

Updated Date - 2021-08-21T05:45:45+05:30 IST