దొంగిలించిన సొమ్ముతో జల్సా

ABN , First Publish Date - 2021-08-22T04:37:56+05:30 IST

పనిచేస్తున్న ఆస్పత్రి సొమ్మును దొంగిలించి ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనతో భాగస్వామ్యం ఉన్న నిందితుడి భార్య, అత్తమామలపై కూడా కేసు నమోదు చేశారు.

దొంగిలించిన సొమ్ముతో జల్సా
క్రైం ఏడీసీపీ వేణుగోపాలనాయుడు

సన్‌రైజ్‌ ఆస్పత్రి చోరీ కేసులో ఉద్యోగి అరెస్టు

నిందితుడి భార్య, అత్తమామలపై కేసు నమోదు

వీరంతా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వాసులు

విశాఖపట్నం, ఆగస్టు 21: పనిచేస్తున్న ఆస్పత్రి సొమ్మును దొంగిలించి ఆ సొమ్ముతో  జల్సాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనతో భాగస్వామ్యం ఉన్న నిందితుడి భార్య, అత్తమామలపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి క్రైం ఏడీసీపీ వేణుగోపాలనాయుడు శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు తెలిపారు.


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన రెడ్డి సత్తిబాబు (30), అతని భార్య ప్రశాంతిలు కంచరపాలెంలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో పనిచేసేవారని, కొన్ని కారణాలతో యాజమాన్యం ఇద్దరినీ తొలగించిందన్నారు. ఆస్పత్రి అనుపానువులు తెలిసిన సత్తిబాబు ఈనెల 9న అర్ధరాత్రి ఆస్పత్రిలోకి ప్రవేశించి క్యాష్‌బాక్స్‌లోని 16.5 లక్షలు, రెండు తులాల బంగారం గొలుసు, వాచ్‌, సెల్‌ఫోన్‌, ఆస్పత్రి సీసీ టీవీ హార్డ్‌డిస్క్‌ ఎత్తుకుపోయాడని తెలిపారు.


యాజమాన్యం ఫిర్యాదు మేరకు అనుమానితుడు సత్తిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని తెలిపారు. దొంగిలించిన మొత్తం భార్య, అత్తమామలకు ఇచ్చానని చెప్పాడు. దీంతో పోలీసులు వారి వద్ద నుంచి 9.5 లక్షలు, రెండు తులాల బంగారం గొలుసు స్వాధీనం చేసుకుని సత్తిబాబును అరెస్టు చేశారు. దొంగిలించిన డబ్బును విలాసాలకు ఖర్చుచేసిన భార్య ప్రశాంతి, అత్తమామలు జగతి, సూర్యప్రకాశరావులపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం వీరు ముగ్గురూ పరారీలో ఉన్నారని తెలిపారు.


Updated Date - 2021-08-22T04:37:56+05:30 IST