జగన్మోహన్‌రెడ్డిది రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-05-09T04:28:30+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. సీఎం అసమర్థ పాలనకు నిరసనగా శనివారం ఆయన ఇంటి వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు.

జగన్మోహన్‌రెడ్డిది రాక్షస పాలన
దీక్షలో పాల్గొన్న బండారు

ధ్వజమెత్తిన మాజీ మంత్రి బండారు

చంద్రబాబుపై కేసులకు వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష  

పరవాడ, మే 8: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. సీఎం అసమర్థ పాలనకు నిరసనగా శనివారం ఆయన ఇంటి వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాకు వీడియో సందేశాన్ని పంపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై కేసులుపెడితే భయపడే ప్రసక్తే లేదని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే భయపడలేదని గుర్తుచేశారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఎన్‌440కే కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ను కర్నూలులో కనుగొన్న విషయాన్ని చంద్రబాబు ఆంగ్ల పత్రికల ద్వారా తెలుసుకున్నారని, అదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు మీడియా ద్వారా తెలియపరిచారన్నారు. ప్రజలకు ఈ విషయాన్ని చెప్పడమే నేరమా అని బండారు ప్రశ్నించారు. జగన్‌ ముఖ్యమంత్రి పదవిని కక్ష సాధింపునకు, ఆదాయ వనరులకోసం వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు.  కరోనాతో మృతిచెందిన వారిలో ఒక్క కుటుంబాన్ని అయినా సీఎం పరామర్శించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు కరోనా నివారణ కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేసి,  మందులు, వెంటిలేటర్లు పంపిణీ చేశారని, ఇది ఓర్వలేని ప్రభుత్వం ఆయనపై  కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంతోమంది చనిపోతున్నారని ఈ విషయాలు సీఎంకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కూర్చుంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుస్తుందా అని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి చంద్రబాబు కాదని బండారు పేర్కొన్నారు. ఆయనపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-09T04:28:30+05:30 IST