ఒలింపిక్స్‌లో భారత్ విజయకేతనం ఖాయం
ABN , First Publish Date - 2021-07-09T04:53:30+05:30 IST
టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు జయకేతనం ఎగురవేయడం ఖాయమని భారత వాలీబాల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత వాలీబాల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు
విశాఖపట్నం (స్పోర్ట్సు), జూలై 8: టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు జయకేతనం ఎగురవేయడం ఖాయమని భారత వాలీబాల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు ఒలింపిక్ గేమ్స్ సెల్ఫీ పాయింట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత భారత్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఈవెంట్ వాయిదా పడినా, ఈ ఏడాది నిర్వహణకు జపాన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కరోనా కారణంగా స్టేడియంలు మూతపడి అంతంత సాధనతోనే భారత్ క్రీడాకారులు వెళ్తున్నా సంకల్ప బలంతో నెగ్గుకు రాగలరన్న నమ్మకం ఉందన్నారు. 18 క్రీడల్లో 120 మంది పాల్గొంటున్నారని, వీలైనన్ని ఎక్కువ పతకాలు సొంతం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్, ఎం.వి.మాణిక్యాలు, ఏయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్, జిల్లా స్పోర్ట్సు అథారిటీ చీఫ్ కోచ్ ఎన్.సూర్యారావు, భారత వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఉపాధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, ద్యాన్‌చంద్ అవార్డు గ్రహీత ఎన్.ఉష, బి.రామయ్య, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.