విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలను పెంచాలి

ABN , First Publish Date - 2021-10-07T05:44:59+05:30 IST

విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ సూచించారు.

విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలను పెంచాలి
పద్మనాభం జెడ్పీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న చంద్రకళ

జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ

పద్మనాభం, అక్టోబరు 6: విద్యార్థులలో  కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ సూచించారు. పద్మనాభం, రెడ్డిపల్లి జెడ్పీ పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థు లకు కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ స్వేచ్ఛ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి పాఠశాలలోని తరగతుల గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను ఆమె స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో మాట్లాడుతూ వంట కోసం కట్టెల పొయ్యిలు కాకుండా గ్యాస్‌ను వినియోగించాలని సూచించారు. అయితే గ్యాస్‌ సిలిండర్ల ధర అధికంగా ఉండడంతో తాము కొనుగోలు చేయలేకపోతున్నామని నిర్వాహకులు డీఈవోకు వివరించారు. ఆ తర్వాత పద్మనాభం జిల్లా పరిషత్‌ పాఠశాలకు వెళ్లిన చంద్రకళ అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం ఏడీ రామరాజు, కోఆర్డినేటర్‌ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు వి.శంకరరావు, బాలామణి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-07T05:44:59+05:30 IST