రైళ్లపై ప్రభావంరైళ్లపై ప్రభావం

ABN , First Publish Date - 2021-05-03T04:39:00+05:30 IST

కరోనా విభృంభణ రైళ్లపై తీవ్రంగా పడింది. హౌరా వెళ్లే రైళ్లకు మినహా మిగిలిన అన్ని రైళ్లకు కేవలం సాధారణ రద్దీ ఏర్పడింది.

రైళ్లపై ప్రభావంరైళ్లపై ప్రభావం

పడిపోయిన ఆక్యుపెన్సీ 

హౌరా రైళ్లకు మాత్రమే డిమాండ్‌ 

కరోనాతో ప్రయాణాలకు సాహసించని జనం 

అయినా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్న అధికారులు 

 

విశాఖపట్నం, మే 2: కరోనా విభృంభణ రైళ్లపై తీవ్రంగా పడింది. హౌరా వెళ్లే రైళ్లకు మినహా మిగిలిన అన్ని రైళ్లకు  కేవలం సాధారణ రద్దీ ఏర్పడింది. రైల్వే అధికారులు ప్రవేశపెట్టిన వేసవి ప్రత్యేక రైళ్లకు కనీస డిమాండ్‌ లేకుండా పోయింది. సికింద్రాబాద్‌, తిరుపతి, చెన్నై, బెంగళూరు, ముంబయి, హౌరా, భువనేశ్వర్‌ వంటి ప్రాంతాలకు  ప్రత్యేకంగా నడుపుతున్న గోదావరి, తిరుమల, మెయిల్‌, గరీబ్‌రథ్‌, ఫలక్‌నూమా, బొకారో, ఎల్‌టీటీ, ప్రశాంతి వంటి సర్వీసులు కూడా తక్కువ ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం ప్రజల్లో తీవ్ర ఆందోళన, భయాన్ని నెలకొల్పుతున్న నేపథ్యంలో దూర ప్రాంతల ప్రయాణాలకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో వ్యాపార, ఉద్యోగ, విద్య కార్యకలాపాల నిమిత్తం సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు విరివిగా రాకపోకలు సాగించే వారు సైతం ప్రయాణాలను విరమించుకోవడంతో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌,  ఫలక్‌నూమా, గరీబ్‌రథ్‌ వంటి ప్రత్యేక రైళ్లకు డిమాండ్‌ అనూహ్యంగా తగ్గింది. ఇక కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి పరుగులు తీసే భక్తులు సైతం ప్రయాణాలకు ఆసక్తి చూపకపోవడంతో తిరుమల ఎక్స్‌ప్రెస్‌తో (ప్రత్యేక రైలు) పాటు తిరుపతి మీదుగా నడిచే రైళ్లకు ఆశించిన ఆక్యుపెన్సీ లేకుండా పోయింది.  ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు సాగించే వారితో పాటు రోజు వారీ కార్మికులు (వలస కార్మికులు) తమ సొంత ఊర్లకు చేరాల్సిన పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో  దూర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర స్టేషన్లకు చేరుతున్న రైళ్లకు కాస్త డిమాండ్‌ ఏర్పడింది. మల్దాటౌన్‌, త్రివేండ్రం మధ్య కేవలం రెండు ట్రిప్పులు మాత్రమే నడిపిన ప్రత్యేక రైళ్లకు బెర్తులు నిండిపోయి తీవ్ర డిమాండ్‌ రావడమే దీనికి నిదర్శనం.


హౌరా రైళ్లకు డిమాండ్‌

విశాఖ మీదుగా చెన్నై నుంచి హౌరా వెళ్లే ప్రత్యేక మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (02822), ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02704), యశ్వంత్‌పూర్‌-హౌరా (02874) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ రైళ్లకు  ఈనెల 12  వరకు అన్ని క్లాసుల్లో బెర్తులు నిండిపోయాయి. తర్వాత తేదీల్లో కూడా బెర్తులు లభించే పరిస్థితి కనిపించడం లేదు. వీటితోపాటు సికింద్రాబాద్‌-షాలీమార్‌ (02777), పాండిచ్చేరి-హౌరా (02868), యశ్వంత్‌పూర్‌-హౌరా స్పెషల్‌ (06597),  కన్యాకుమారి-హౌరా (02666), త్రివేండ్రం-షాలిమార్‌ స్పెషల్‌ (02641) రైళ్లకు డిమాండ్‌ నెలకున్నది. హౌరా రైళ్లకు డిమాండ్‌ ఏర్పడంతో ఆ ప్రభావం భువనేశ్వర్‌, కుర్దారోడ్డు, కటక్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై పడింది. 


 ప్రత్యేక రైళ్లకు బెర్తులు ఖాళీ

ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో ఏడాది పొడవునా రద్దీ వుండే గోదావరి, తిరుమల, మెయిల్‌ వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ (ప్రత్యేక) రైళ్లకు బెర్తులు ఖాళీగా వున్నాయి. ప్రత్యేక గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు (02727) మరో వారం రోజుల వరకు ఏసీ, స్లీపర్‌, సెకెండ్‌ క్లాసుల్లో బెర్తులు ఖాళీలుండగా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు (07015) ఏసీ, స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌ల్లో బెర్తులు ఖాళీ /ఆర్‌ఏసీ  ఏర్పడింది. విశాఖ-కాచీగూడ (08561), షాలీమార్‌-సికింద్రాబాద్‌ (02773) రైళ్లకు అన్ని క్లాసుల్లో బెర్తులు అందుబాటులో వున్నాయి. తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 8 వరకు అన్ని తరగతుల్లో బెర్తులు ఖాళీలున్నాయి.   ఇక చెన్నై వెళ్లే ప్రత్యేక మెయిల్‌కు కూడా ఈనెల ఎనిమిది వరకు ఏసీ కోచ్‌ల్లో బెర్తులు అందుబాటులో వుండగా స్లీపర్‌, క్లాసు కోచ్‌ల్లో ఆర్‌ఏసీ నెలకొనడం విశేషం.  విశాఖ మీదుగా భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రత్యేక ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు (08463) ఈనెల 8 వరకు బెర్తులు అందుబాటులో వున్నాయి. హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌కూ (02873) బెర్తులు ఖాళీ. ఇక విశాఖ నుంచి వయా రాయగడ మీదుగా ముంబయి వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు (02857) బెర్తులు ఖాళీలున్నాయి.


ప్రత్యేక రైళ్లకు వెనుకాడని అధికారులు

ఇదిలా వుంటే... ఆశించిన ఆక్యుపెన్సీ లేకపోయినా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంలో రైల్వే అధికారులు వెనుకాడడం లేదు. విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల సందర్భంగా పలు ప్రాంతాల్లో వుంటున్నవారు  సొంత ఊర్లు చేరేందుకు ప్రత్యేక రైళ్లు దోహపడతాయని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా విలయతాండంతో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సమయంలోనైనా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలతో సొంత ఊర్లకు పయనమవుతున్న వారికి ప్రత్యేక రైళ్లు బాసటగా నిలుస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ప్రతి ఏడాదీ వేసవిలో తీవ్ర డిమాండ్‌ ఏర్పడి కిక్కిరిసిన ప్రయాణికులతో నడిచే రైళ్లపై రెండేళ్లుగా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. 


Updated Date - 2021-05-03T04:39:00+05:30 IST