ఆశ్రమంలో ఆకలికేకలు

ABN , First Publish Date - 2021-11-09T06:03:18+05:30 IST

గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ సప్పర్లలోని పభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిర్లక్ష్యం కారణంగా సుమారు రెండు వందల మంది విద్యార్థులు మూడు రోజుల నుంచి సరైన భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారు.

ఆశ్రమంలో ఆకలికేకలు
రోడ్డుపై బైఠాయించిన సప్పర్ల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.


గ్యాస్‌ సిలిండర్లు అయిపోవడంతో నిలిచిన వంట

పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయిన హెచ్‌ఎం

తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు

హెచ్‌ఎంని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

సీలేరు, నవంబరు 8: గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ సప్పర్లలోని పభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిర్లక్ష్యం కారణంగా సుమారు రెండు వందల మంది విద్యార్థులు మూడు రోజుల నుంచి సరైన భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారు. శనివారం సాయంత్రం వంట గ్యాస్‌ అయిపోవడంతో ఆ రోజు రాత్రి వసతిగృహంలో వంట చేయలేదు. హెచ్‌ఎం కిలో గెన్ను అదేరోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇన్‌చార్జి బాధ్యతలను మరే ఇతర ఉపాధ్యాయునికి అప్పజెప్పకపోవడంతో వంట గ్యాస్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సమీప గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఆదివారం ఉదయం ఇళ్లకు వెళ్లిపోగా, మిగిలిన విద్యార్థులు తమ వద్ద వున్న కొద్దిపాటి డబ్బులతో స్థానికంగా చిరుతిండ్లు కొనుక్కొని పొట్ట నింపుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో పి.వినాయకరావు...గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జిబాబుకి ఫోన్‌ చేసి ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి వంట గ్యాస్‌ సిలిండర్‌ పంపాలని కోరారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన గ్యాస్‌ సిలిండర్‌ను హాస్టల్‌కు పంపారు. సిబ్బంది అప్పుడు వంట చేసి విద్యార్థులకు భోజనం  (మధ్యాహ్నం, రాత్రికి కలిపి ఒకసారి) పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం సప్పర్ల చేరుకుని తమ పిల్లలతో కలిసి చింతపల్లి-సీలేరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో వినాయకరావు సప్పర్ల చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, గెన్ను ప్రధానోపాధ్యాయుడిగా వచ్చినప్పటి నుంచి మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, నాడు-నేడు పనుల్లో నాణ్యత లోపించిందని, భారీగా నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు. ఏటీడబ్ల్యూవో స్పందిస్తూ హెచ్‌ఎంపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని, ఇక్కడ జరిగిన విషయాలను గిరిజన సంక్షేమ శాఖ డీడీకి నివేదిక రూపంలో అందజేస్తానని చెప్పారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నామని, హెచ్‌ఎంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే మంగళవారం మళ్లీ ఆందోళన చేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.  

Updated Date - 2021-11-09T06:03:18+05:30 IST