పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు
ABN , First Publish Date - 2021-05-11T04:43:57+05:30 IST
పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేసే కార్మికులకు గత పదమూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పదమూడు నెలలుగా అందని జీతాలు
కుటుంబ పోషణ కోసం అప్పులు
పట్టించుకోని అధికారులు
కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పారిశుధ్య కార్మికులకు గుర్తింపు ఉంది. వారి సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించే వారే. అయితే వారికి పదమూడు నెలలుగా జీతాలు లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొందరు పస్తులతో పనిలోకి వస్తున్నా వారి సమస్యలను పరిష్కరించే అధికారే కొరవడ్డాడు.
పరవాడ, మే 10: పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేసే కార్మికులకు గత పదమూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్తా చెదారం తొలగిస్తూ, మురుగు కాలువలను శుభ్రం చేసే కార్మికులు వేతనాలు అందక, కుటుంబ పోషణ కోసం అవస్థలు పడుతున్నారు. తమ వేతనాల గురించి అధికారులకు ఎన్ని పర్యాయాలు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఉదయాన్నే రోడ్ల మీదకు వచ్చి ప్రజలు బయటకు రాకముందే రహదారులు శుభ్రం చేయడం, కాలువల్లో పూడికలు తీయడం వంటి పనులు చేసే పారిశుధ్య కార్మికులు తక్షణం తమకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పనికి ఆలస్యమైతే ఒప్పుకోరు
పనిలోకి ఒక గంట ఆలస్యమైతే ఒప్పుకోని అధికారులు పదమూడు నెలల వేతనాలు ఆలస్యం అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉరుకులు పరుగులు మీద అక్కడ చెత్త తొలగించాలి. అక్కడకు వెళ్లండి అంటూ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం ఏదో ఒక చోట చెత్తాచెదారం తొలగించే పనులు చేయించుకుంటూ తమ గోడు వినడం లేదని వాపోతున్నారు.
రూ.4.50 లక్షల బకాయిలు
మండలంలోని 15 పంచాయతీల్లో సుమారు 50 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 13 నెలల నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. పంచాయతీలో పారిశుధ్య పనులు చేసే కార్మికులకు సుమారు రూ.4.50 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది.