హుండీల సొమ్ము స్వాహాపై విచారణ

ABN , First Publish Date - 2021-08-10T06:05:07+05:30 IST

జిల్లాలోని ఎర్నిమాంబ, ధారలింగేశ్వర స్వామి ఆలయాల్లో హుండీల సొమ్ము పక్కదారి పట్టిందని వచ్చిన ఆరోపణలపై దేవదాయ శాఖ రాజమండ్రి ఆర్‌జేసీ సురేశ్‌బాబు సోమవారం ఇక్కడ విచారణ జరిపారు.

హుండీల సొమ్ము స్వాహాపై విచారణ

నగరానికి దేవదాయ శాఖ రాజమండ్రి ఆర్‌జేసీ 

డీసీ, ఏసీ సహా సిబ్బంది నుంచి వివరాల సేకరణ

నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నివేదిక


విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎర్నిమాంబ, ధారలింగేశ్వర స్వామి ఆలయాల్లో హుండీల సొమ్ము పక్కదారి పట్టిందని వచ్చిన ఆరోపణలపై దేవదాయ శాఖ రాజమండ్రి ఆర్‌జేసీ సురేశ్‌బాబు సోమవారం ఇక్కడ విచారణ జరిపారు. ప్రతి ఒక్కరి నుంచి విడివిడిగా వివరాలు సేకరించారు. మొదట దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి కార్యాలయంలో ఆమె వివరణ తీసుకున్నారు. అనకాపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజు సస్పెన్షన్‌, ఆ తరువాత జరిగిన పరిమణాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీ కార్యాలయం సిబ్బంది తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. తమను ఆమె మానసికంగా వేధిస్తున్నారని, ఉద్యోగ భద్రతపై భయం పట్టుకుందని ఫిర్యాదుచేశారు. వాటన్నింటినీ ఆర్‌జేసీ రికార్డు చేసుకున్నారు. అలాగే వివిధ ఆలయాల ఈఓలు కూడా ఆమెపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తండ్రి సంస్మరణ దినం ఉందని సెలవు కోరినా మంజూరు చేయకుండా వేరే చోట హుండీల లెక్కింపు డ్యూటీ వేశారని ఓ ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యారు. 


అది పూర్తయిన వెంటనే డీసీ పుష్పవర్దన్‌ కార్యాలయానికి చేరి, అక్కడి సిబ్బందిని ఒకరి తరువాత మరొకరిని పిలిచి విచారించారు. గొలుగొండ మండలం ధారలింగేశ్వరస్వామి ఆలయంలో ఈఓ లేకుండానే ఏసీ శాంతి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజు హుండీని తెరిచారనే ఆరోపణలపై ఆర్‌జేసీ విచారణ చేశారు. ఎర్నిమాంబ ఆలయ హుండీల లెక్కింపు ఏప్రిల్‌ 29, జూన్‌ నెలల్లో జరగ్గా ఆ రెండుసార్లు బ్యాంకు అధికారులు ఆలయానికి రాలేదని, సిబ్బందే లెక్కించిన సొమ్మును తీసుకువెళ్లి బ్యాంకులో డిపాజిట్‌ చేశారనే విషయం ఈ సందర్భంగా బయటపడింది. సాధారణంగా బ్యాంకు అధికారులే ఆలయానికి వచ్చి సొమ్ము డిపాజిట్‌ చేయించుకుంటారు. కానీ ఏప్రిల్‌, జూన్‌ నెలల్లో అలా జరగలేదని, ఆ నెలల్లోనే ఆదాయం తక్కువగా వచ్చిందని తేల్చారు. ఈ విషయాలను కూడా ఆర్‌జేసీ రికార్డు చేసుకున్నారు. ఎర్నిమాంబ ఆలయం ఉద్యోగి ఒకరు ఏసీ శాంతి కారు డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా ఆర్‌జేసీ గుర్తించారు. వివిధ ఆరోపణలతో సస్పెండైన శ్రీనివాసరాజును, ఆయన్ను సస్పెండ్‌ చేసిన డీసీ పుష్పవర్దన్‌ను కూడా ఆర్‌జీసీ విచారణ చేసి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. అన్నింటిపై ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నివేదిక సమర్పిస్తానని చెప్పారు.

Updated Date - 2021-08-10T06:05:07+05:30 IST