కామత్‌ హోటల్‌ ఆక్రమణలు తొలగింపు

ABN , First Publish Date - 2021-01-20T05:50:25+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్థు నిర్మించి హోటల్‌ నిర్వహిస్తున్నార నే అభియోగంపై బీచ్‌రోడ్డులోని కామత్‌ హోటల్‌ రెండో అంతస్థును జీవీఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు.

కామత్‌ హోటల్‌ ఆక్రమణలు తొలగింపు
ఆక్రమణలను తొలగిస్తున్న జీవీఎంసీ సిబ్బంది

ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్థు నిర్మాణం

యంత్రాల సహాయంతో పై అంతస్థు స్తంభాలు, షీట్లు తొలగింపు

విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్థు నిర్మించి హోటల్‌ నిర్వహిస్తున్నార నే అభియోగంపై బీచ్‌రోడ్డులోని కామత్‌ హోటల్‌ రెండో అంతస్థును జీవీఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు.  చినవాల్తేరు సర్వే నంబర్‌ 49/2సీ2, 49/2సి3, 49/2సీ4లో 1053 చదరపు మీటర్ల స్థలంలో ఎస్‌.సుబ్బరాజు, ఎస్‌.లక్ష్మి కలిసి ఏసీ రూఫ్‌ షీట్లతో జీ+1 తరహాలో తాత్కాలిక భవనాన్ని నిర్మించారు. హోటల్‌ కామత్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి చాలాకాలం కిందట జీవీఎంసీకి ప్లాన్‌ కోసం దరఖాస్తు పెట్టుకోగా, సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో జీవీఎంసీ ప్లాన్‌ జారీకి నిరాకరించింది. దీంతో కోర్టు నుంచి ప్లాన్‌ అనుమతి తెచ్చుకున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా జీ+1 తరహా భవనాన్ని తాత్కాలిక షీట్లతో నిర్మించి హోటల్‌ కామత్‌ పేరుతో ప్రారంభించారు. సీఆర్‌జడ్‌ నింబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్థు నిర్మించి హోటల్‌ నిర్వహించడంతోపాటు, కోర్టు నుంచి తీసుకున్న ప్లాన్‌ కంటే  అదనంగా 260 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి హోటల్‌ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సెట్‌బ్యాక్‌లను కూడా విడిచిపెట్టలేదు. వీటన్నింటినిపైనా జీవీఎంసీకి ఫిర్యాదులు అందడంతో 2016లోనే ఆక్రమణలు తొలగింపునకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఇంతలో హోటల్‌ యజమాని కోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం గడువు ఇవ్వాలని, ఆలోగా పిటిషనరే ఆక్రమణలను తొలగించుకుంటారని కోర్టు జీవీఎంసీకి సూచించింది. తర్వాత ఆక్రమణలను తొలగించకుండా హోటల్‌ యజమాని తాను ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి పిటిషన్‌ పెట్టుకున్నారు. అయితే ఆ భూమిలో గెడ్డ ఉండడంతో ఇప్పటికీ అది పెండింగ్‌లోనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామత్‌ హోటల్‌ ఆక్రమణల విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతో కామత్‌ ఆక్రమణలు తొలగింపునకు జీవీఎంసీ అధికారులు గత నెల ఒకటిన సమాయత్తం కాగా, హోటల్‌ యజమాని కోర్టు నుంచి స్టే పొందారు. అయితే విచారణ అనంతరం మంగళవారం  న్యాయస్థానం స్టేను కొట్టివేసింది. దీంతో జీవీఎంసీ అధికారులు మంగళవారం సాయంత్రం యంత్రాలను తీసుకెళ్లి హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పై అంతస్థుతోపాటు సెట్‌బ్యాక్‌ల ఉల్లంఘనలను తొలగించారు. గ్యాస్‌ కట్టర్లతో పై అంతస్థులోని ఇనుప స్తంభాలను కట్‌చేసి, ఏసీ షీట్లను తొలగించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకునే అధికారం జీవీఎంసీకి లేనందున ఆ విషయంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్టు సీసీపీ ఆర్జే విద్యుల్లత తెలిపారు. తొలగింపుల కార్యక్రమాన్ని సిటీ ప్లానర్‌ ప్రభాకర్‌, జోన్‌-3 ఏసీపీ భాస్కరబాబు, ఇతర అధికారులు స్వయంగా పర్యవేక్షించారు.


Updated Date - 2021-01-20T05:50:25+05:30 IST