ఇంటికంటే రుచిగా హాస్టల్‌ భోజనం

ABN , First Publish Date - 2021-11-09T05:55:54+05:30 IST

ఇళ్ల వద్ద తల్లిదండ్రులు పెట్టే దాని కంటే కూడా రుచికరమైన భోజనాన్ని బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

ఇంటికంటే రుచిగా హాస్టల్‌ భోజనం
విద్యార్థులకు పరమాన్నం వడ్డిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

పేదరికాన్ని జయించేందుకు విద్యను ఆయుధంగా చేస్తాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి వేణుగోపాలకృష్ణ 

సింహాచలం, నవంబరు 8: ఇళ్ల వద్ద తల్లిదండ్రులు పెట్టే దాని కంటే కూడా రుచికరమైన భోజనాన్ని బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం సింహాచలంలోని ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో అమ్మ చేతి వంటకంటే రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో వంట వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. వంటకు వినియోగించే నిత్యావసరాలను పెద్ద సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు త్వరలో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. పేదరికాన్ని జయించేందుకు విద్యను ఆయుధంగా చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం హాస్టళ్లలో మెరుగైన వసతి కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి వంటశాలను, నిత్యావసరాలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా పరమాన్నం వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డార్మెటరీలు ప్రమాదకరంగా ఉన్నాయని, తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న డార్మెటరీ ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తరగతి గదిలో మంత్రి కాసేపు కూర్చుని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాసరి సత్యారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-09T05:55:54+05:30 IST