హైవే టెన్షన్‌!

ABN , First Publish Date - 2021-01-20T05:49:41+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విశాఖ మన్యం మీదుగా విజయనగరం వరకు తలపెట్టిన జాతీయ రహదారి-516 నిర్మాణానికి భూముల సేకరణ అధికారులకు కత్తిమీద సాములా మారింది.

హైవే టెన్షన్‌!
జాతీయ రహదారి కానున్న పాడేరు-అరకులోయ మెయిన్‌రోడ్డు

రాజమహేంద్రవరం-విజయనగరం మధ్య కొత్తగా జాతీయ రహదారి 

385 కిలోమీటర్ల పొడవు...

రూ.1700 కోట్ల అంచనా వ్యయం 

విశాఖ ఏజెన్సీ మీదుగా నిర్మాణం

ఇళ్ల స్థలాలు, పంట భూములను తీసుకోబోమంటున్న గిరిజనులు

ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో న్యాయం జరగదని ఆవేదన

భూసేకణకు వ్యతిరేకంగా పలు మండలాల్లో ఆందోళనలు


పాడేరు, జనవరి 19: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విశాఖ మన్యం మీదుగా విజయనగరం వరకు తలపెట్టిన జాతీయ రహదారి-516 నిర్మాణానికి భూముల సేకరణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. రహదారి కోసం చేపట్టే భూసేకరణపై పలుచోట్ల గిరిజనులు అభ్యంతరం చెబుతున్నారు. హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 2018లో తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2019లో రూ.1,700 కోట్లతో 385 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారి (నంబర్‌ 516) నిర్మిస్తామని కేంద్రం ప్రకటించి, నిధులు మంజూరుచేసింది. అప్పటి నుంచి అధికారులు సర్వే పనులు చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మూడు ప్యాకేజీల పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే టెండర్లు పూర్తయిన ప్యాకేజీల పరిధిలో భూములను సేకరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై పడింది. పలు మండలాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించి, జాతీయ రహదారి నిర్మాణానికి భూమిని సేకరించాల్సి వుంటుందని చెబుతున్నారు. దీనికి పలు గ్రామాల్లో గిరిజనులు అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో తమకు న్యాయం జరగదని, అందువల్ల ఇళ్లు, పంట భూముల జోలికి రాకుండా జాతీయ రహదారి నిర్మించాలని అధికారులను కోరారు. చింతపల్లి, పాడేరు, అరకులోయ వంటి ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్డు నిర్మించాలని కొంతమంది స్థానికులు సూచించారు. కాగా జాతీయ రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, గిరిజనులకు నష్టం కలగకుండా చూడాలని గిరిజన సంఘం రాష్ట్ర నేతలు పి.అప్పలనర్స, కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు గ్రామాలు, పంట పొలాల మీదుగా జాతీయ రహదారిని నిర్మించవద్దంటూ హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ ఏవిధంగా చేపట్టాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.


ఇవీ ప్యాకేజీలు

జాతీయ రహదారి-516 నిర్మాణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1 రాజమహేం ద్రవరం నుంచి రంపచోడవరం వరకు, ప్యాకేజీ-2 రంపచోడవరం నుంచి కృష్ణాదేవిపేట వరకు, ప్యాకే జీ-3 కృష్ణాదేవిపేట నుంచి పాడేరు వరకు (వయా పెదవలస, చింతపల్లి, లంబసింగి, జి.మాడుగుల), ప్యాకేజీ-4 పాడేరు నుంచి భల్లుగుడ వరకు (వయా డుంబ్రిగుడ, అరకులోయ), ప్యాకేజీ-5 భల్లుగుడ నుంచి బొడ్డవర వరకు (వయా అనంతగిరి), ప్యాకేజీ-6  బొడ్డవర నుంచి విజయనగరం వరకు.


ఐదు మండలాల్లో 480 ఎకరాల పంట భూములు సేకరణ?

అధికారులు రూపొందించిన ప్లాన్‌ ప్రకారం జాతీయ రహదారి నిర్మాణం వల్ల పాడేరు నుంచి బొడ్డవర వరకు పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల్లోని 41 గ్రామాల పరిధిలో 700 గిరిజన కుటుంబాలు 480 ఎకరాల పంట భూములను కోల్పోతాయని గిరిజన సంఘం నేతలు చెబుతున్నారు. పాడేరు మండలంలో రెండు గ్రామాలకు చెందిన 30 ఎకరాలు, హుకుంపేట మండలంలో 15 గ్రామాలకు చెం దిన 150 ఎకరాలు, డుంబ్రిగుడ మండలంలో ఏడు గ్రామాలకు చెందిన 100 ఎకరాలు, అరకులోయ మండ లంలో ఏడు గ్రామాల పరిధిలో 110 ఎకరాలు, అనంతగిరి మండలంలో 10 గ్రామాలకు చెందిన 90 ఎకరాలను సేకరించాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది.

Updated Date - 2021-01-20T05:49:41+05:30 IST