హైవే బడ్జెట్‌ రూ.298 కోట్లు

ABN , First Publish Date - 2021-12-15T06:14:56+05:30 IST

నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) అభివృద్ధికి రూ.298 కోట్లు కేటాయించాలంటూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.

హైవే బడ్జెట్‌ రూ.298 కోట్లు

నిధులిచ్చినా లేదా అభివృద్ధి చేసిచ్చినా...ఏదైనా ఓకె

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల వినతి

అనకాపల్లి-ఆనందపురం రహదారి పనులు పూర్తి కావడంతో నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారి త్వరలో రాష్ర్టానికి అప్పగింత?

12 చోట్ల ఫ్లై ఓవర్‌బ్రిడ్జిలు, మరికొన్నిచోట్ల అండర్‌పాస్‌, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం, గతుకుల మయమైన రహదారిపై కొత్తగా లేయర్‌ ఏర్పాటుకు నేతల ప్రతిపాదనలు

కేంద్రంపైనే భారం



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) అభివృద్ధికి రూ.298 కోట్లు కేటాయించాలంటూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అనకాపల్లి నుం చి ఆనందపురం వరకూ చేపట్టిన బైపాస్‌ రహదారి నిర్మాణం పూర్తవ్వడంతో, ప్రస్తుత జాతీయ రహదారిని కేంద్రం త్వరలో రాష్ట్రానికి అప్పగించబోతోంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు రోడ్డుపై గోతులు లేకుండా కొత్త లేయర్‌ వేసేందుకు నిధులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు.

జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) నగరం మధ్య నుంచి వెళుతోంది. భారీ వాహనాలు రాకపోకలు, ట్రాఫిక్‌జామ్‌లు, రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం వరకూ గల రహదారిని విస్తరించాలని (నాలుగు లేన్లు) రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, దాదాపు పనులు పూర్తవ్వడంతో ఆ మార్గంలోనే పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం నగరం మధ్య నుంచి వెళుతున్న రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా నుంచి డీనోటిఫై చేసి, నిర్వహణను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. అయితే జాతీయ రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానికంగా వున్న నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై తాము ఏమీ చేయలేమని,  కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. 


12 చోట్ల ఫైఓవర్‌ల నిర్మాణం

జాతీయ రహదారిని డీనోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే 12చోట్ల ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారుచేశారు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నందున...అనకాపల్లి టౌన్‌, లంకెలపాలెం, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, మురళీనగర్‌, తాటిచెట్లపాలెం/పోర్టు హాస్పిటల్‌ జంక్షన్‌, గురుద్వారా, సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, హనుమంతవాక, పీఎంపాలెం కార్‌షెడ్డు, మధురవాడ వంటి చోట్ల ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, పాదచారులు రోడ్డు దాటేందుకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, సర్వీస్‌ రోడ్ల అభివృద్ధి, ప్రస్తుతం గతుకులమయంగా తయారైన రహదారిపై కొత్తగా లేయర్‌ నిర్మాణం కోసం రూ.298 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే  ఆయా పనులను చేపట్టాలని, లేనిపక్షంలో ఆ మొత్తాన్ని విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.

Updated Date - 2021-12-15T06:14:56+05:30 IST