ప్రభుత్వ భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-08-21T05:54:48+05:30 IST

మండలంలోని పెదపూడి ఊరకొండపై నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలపై హైకోర్టు స్టే విధించింది.

ప్రభుత్వ భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే
పెదపూడి ఊరకొండపై నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు

పెదపూడిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు

కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశం


బుచ్చెయ్యపేట, ఆగస్టు 20: మండలంలోని పెదపూడి ఊరకొండపై నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలపై హైకోర్టు స్టే విధించింది. ఊరకొండపై గ్రామ సచివాలయం, రైతుభరోసా, ఉప ఆరోగ్య కేంద్రం, అమూల్‌ పాల కేంద్ర భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. గ్రామసభ ఆమోదం లేకుండా భవనాలు నిర్మించడం చట్ట విరుద్ధమని గ్రామానికి చెందిన గోకివాడ రామకృష్ణ, కరగాన నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణాలను నిలిపివేయాలని పిటిషనర్లు తరపున న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు భవన నిర్మాణాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్వరులను జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. దీనిపై ఈవోపీఆర్డీ నారాయణరావును వివరణ కోరగా, నిబంధనల మేరకే ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌ ద్వారా హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-08-21T05:54:48+05:30 IST