జీవీఎంసీ బ్రాడ్‌బ్యాండ్
ABN , First Publish Date - 2021-05-22T05:10:26+05:30 IST
స్మార్ట్‌సిటీలో భాగంగా సొంతంగా బ్రాడ్‌బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది.

రూ.25 కోట్లతో సొంతంగా ఏర్పాటుకు అడుగులు
స్మార్ట్‌సిటీలో భాగంగా పనులు
ఆర్‌ఎఫ్‌పీ సమర్పణకు వచ్చే నెల ఆరు వరకూ గడువు
ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా కొత్త ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నలు
నిధుల్లేక ఇప్పటికే రూ.402 కోట్ల బిల్లులు పెండింగ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్మార్ట్‌సిటీలో భాగంగా సొంతంగా బ్రాడ్‌బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది. రూ.25 కోట్లతో ‘జీవీఎంసీ బ్రాడ్‌బ్యాండ్’ ఏర్పాటుకు ఆసక్తిగల ఏజెన్సీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పీ)లను వచ్చే నెల 6వ తేదీలోగా సమర్పించాలంటూ ప్రకటన జారీచేసింది. ఇది అందుబాటులోకి వస్తే ఇంటర్‌నెట్ కోసం చెల్లిస్తున్న ఖర్చు మిగులుతుందని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జీవీఎంసీ ఒకేసారి భారీమొత్తం వెచ్చించడానికి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలు, వార్డు సచివాలయాలు, పాఠశాలలతోపాటు జీవీఎంసీ అనుబంధ కార్యాలయాలు, భవనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నగరంలో ఏర్పాటుచేసిన 50 స్మార్ట్ పోల్స్, స్మార్ట్ స్కూల్స్‌కు ఇంటర్నెట్ అవసరం. ఇందుకోసం ఏడాదికి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు సొంతంగా ఇంటర్‌నెట్‌ను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.
నెట్‌వర్క్ సరఫరా (100 నుంచి 300 ఎంబీపీఎస్ స్పీడు) టెండర్ దక్కించుకున్న కంపెనీ నగరంలో ఏదో ఒక టవర్ వద్ద ఇంటర్‌నెట్ పాయింట్ ఇస్తుంది. అక్కడి నుంచి జీవీఎంసీ సొంతంగా కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకుని కార్యాలయాలు, సంస్థలు, స్మార్ట్ పోల్స్‌కు ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వనున్నది. సర్వీస్ నిర్వహణ బాధ్యత కూడా జీవీఎంసీయే చూసుకుంటుంది. నెట్‌వర్క్ ప్రొవైడర్ ఇచ్చే పరిమితి వరకు జీవీఎంసీ డేటా వాడుకునే అవకాశం ఉంటుంది. తాము తెచ్చుకున్న పరిమితిలో ఇంకా డేటా మిగిలితే వాణిజ్య సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, కార్యాలయాలకు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చునని అంచనా వేస్తోంది.
మళ్లీ అప్పు చేయాల్సిందే...
స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు జీవీఎంసీ తన వాటా నిధులు వెచ్చిస్తోంది. ఉదాహరణకు మల్కాపురం ప్రాంతంలో సుమారు రూ.780 కోట్లతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు ఖర్చు పెడుతోంది. ఆ నిధులు అందుబాటులో లేక రుణం తీసుకుని సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టులో జీవీఎంసీ వాటాగా సుమారు రూ.20 కోట్లు వెచ్చించాల్సి వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే జరిగితే నిధుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిందేనంటున్నారు.
ఆదాయం ఖర్చులకే సరి
జీవీఎంసీకి వివిధ మార్గాల్లో ఏటా రూ.500 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతున్నప్పటికీ అదంతా నిర్వహణ ఖర్చులకే సరిపోతోంది. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలకు నెలకు రూ.18 కోట్లు, పంప్‌హౌస్‌లు, కార్యాలయాలకు సంబంధించిన కరెంటు బిల్లుల చెల్లింపునకు రూ.5 నుంచి 6 కోట్లు, అఽధికారులు వినియోగించే డీజిల్, పెట్రోల్ ఖర్చులకి రూ.1.5 కోట్లు, డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలకు రూ.2 కోట్లు, రుణవాయిదాలు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు రూ.5 కోట్లు, వీధిదీపాలు నిర్వహించే ఈఈఎస్‌ఎల్‌కి రూ.2 కోట్లు, సెక్యూరిటీ గార్డులు జీతాలు, ఇతర ఖర్చులకు రూ.2 కోట్ల చొప్పున ఖర్చుచేయాల్సి వస్తోంది. తగినంత ఆదాయం లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత 20 నెలలుగా రూ.402 కోట్ల మేర బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కొత్తగా పిలిచే పనులకు ఒక్కరు కూడా టెండరు వేయడం లేదు. ఈ తరుణంలో సొంతంగా బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు సరికాదని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ ఆహ్వానం
బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు కోసం ఆసక్తిగల ఏజెన్సీల నుంచి ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానిస్తూ జీవీఎంసీ ఇప్పటికే ప్రకటన జారీచేసింది. భూగర్భ కేబుల్ ద్వారా ఏర్పాటుచేసే ఈ వ్యవస్థను ఎనిమిది నెలల్లోగా అందుబాటులో తేవాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే జీవీఎంసీ ఆర్థికంగా పరిపుష్టిగా లేని ఈ సమయంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడాన్ని కొంతమంది అధికారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.