రూ.కోటిన్నర విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-31T06:24:06+05:30 IST

బియ్యం లారీలో తరలిస్తున్న రూ.1.5 కోట్ల విలువైన గుట్కాను విశాఖపట్నం జిల్లా సబ్బవరం పోలీసులు గురువారం పట్టుకున్నారు.

రూ.కోటిన్నర విలువైన గుట్కా స్వాధీనం
పట్టుబడ్డ గుట్కాను అన్‌లోడ్‌ చేస్తున్న దృశ్యం

బియ్యంతో కలిపి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు


సబ్బవరం, డిసెంబరు 30: బియ్యం లారీలో తరలిస్తున్న రూ.1.5 కోట్ల విలువైన గుట్కాను విశాఖపట్నం జిల్లా సబ్బవరం పోలీసులు గురువారం పట్టుకున్నారు. లారీని సీజ్‌ చేసి డైవర్‌, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. విలేఖరుల సమావేశంలో సీఐ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక జోడుగుళ్లు జంక్షన్‌ వద్ద గల ఒక లారీలో గుట్కా వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ సురేశ్‌ సిబ్బందితో వెళ్లి పరిశీలించగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా ఏపీ37 టీఈ7899 నంబర్‌ గల లారీ ఉంది. అందులో వున్న తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ సవిలే చంద్రరావు, మధ్యప్రదేశ్‌కు చెందిన శామ్యూల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లోని బద్వాన్‌ నుంచి కేరళకు 480 బస్తాల బియ్యంతో బయలుదేరామని, మార్గమధ్యంలో బరంపురం వద్ద గుట్కా లోడ్‌ చేస్తారని, ఆ సరకును సబ్బవరం వద్ద కొంతమంది తీసుకుంటారని నిడదవోలుకు చెందిన లారీ యజమాని అరిగల ప్రదీప్‌ చెప్పినట్టు డ్రైవర్‌, క్లీనర్‌లు తెలిపారు. ఈ మేరకు గుట్కాను అప్పగించేందుకు బుధవారం రాత్రి నుంచి జోడుగుళ్లు జంక్షన్‌ సమీపంలోని కళాశాల వద్ద వేచి ఉన్నామన్నారు. లారీలో వున్న చైనీ టుబాకో 56 కిలోల బ్యాగులు 22, రాజా ప్రీమియం టుబాకో 99 బ్యాగుల (ఒక్కొక్కటి 43 కిలోలు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ లక్కోజు సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T06:24:06+05:30 IST