ఇసుక కొండపై గురుపౌర్ణమి వేడుకలు
ABN , First Publish Date - 2021-07-25T05:13:14+05:30 IST
పాతనగరంలోని (విశాఖ వన్‌టౌన్) ఇసుకకొండపై కొలువుదీరిన సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

కొవిడ్ తర్వాత తొలిసారి తెరుచుకున్న ఆలయం
సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, వ్రతాలు
విశాఖపట్నం, జూలై 24: పాతనగరంలోని (విశాఖ వన్‌టౌన్) ఇసుకకొండపై కొలువుదీరిన సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం శనివారం గురుపౌర్ణమి సందర్భంగా రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని తెరిచి ప్రాంగణంలో పూజలు, వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని తమ మనసులో కోర్కెలు స్మరించుకుంటూ ధ్వజ స్తంభం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మండపం ముందు దీపాలు వెలిగించి వ్రతాలు, పూజల్లో పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు జరిగాయి. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఈవో బి.ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కనిపించింది.