గురుకులాలు ఆదర్శవంతంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-28T06:06:24+05:30 IST

అర్ధవంతమైన విద్యాబోధన, సక్రమంగా మెనూ అమలు చేస్తూ గురుకులాలు ఆదర్శవంతంగా ఉండాలని రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు అన్నారు.

గురుకులాలు ఆదర్శవంతంగా ఉండాలి
బాలికలతో మాట్లాడుతున్న ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు


అర్ధవంతమైన విద్యాబోధన జరగాలి

మెనూ సక్రమంగా అమలు చేయాలి

రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు

అరకులోయ, నవంబరు 27: అర్ధవంతమైన విద్యాబోధన, సక్రమంగా మెనూ అమలు చేస్తూ గురుకులాలు ఆదర్శవంతంగా ఉండాలని రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు అన్నారు. శనివారం సాయంత్రం యండపల్లివలస గురుకుల బాలికల ఆశ్రమోన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత గురుకుల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తెలుగు, ఇంగ్లీషు, సైన్స్‌ వంటి పాఠ్యాంశాలను విద్యార్థినులతో చదివించారు. భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారని విద్యార్థినులను రవిబాబు ప్రశ్నించగా.. డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామన్నారు. మీ లక్ష్యం నెరవేరాలంటే పదో తరగతిలో 99 శాతం మార్కులు రావాలన్నారు. అనంతరం ఆఫీస్‌ రూంలో ప్రిన్సిపాల్‌ అరుణజ్యోతిని స్టాఫ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడారు. హాజరుపట్టిక, మెనూ వివరాలను పరిశీలించారు. కుళ్లిన గుడ్లు పెడుతున్నారని, చికెన్‌ సక్రమంగా పెట్టడం లేదని విద్యార్థినులు చెబుతున్నారని రవిబాబు అన్నారు. వార్డెన్‌ చేయలేకుంటే వేరేవారిని నియమించమని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం కస్తూర్బా  పాఠశాలను సందర్శించారు. మూలకు చేరిన ఆర్‌వో ప్లాంట్‌పై ప్రశ్నించగా.. త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా లేక వినియోగంలో లేదన్నారు. కస్తూర్బా పాఠశాలకు అన్ని సరకులు, కూరగాయలు కూడా జిల్లా కేంద్రం నుంచే వస్తున్నాయని, దీనివల్ల మెనూ సక్రమంగా అమలు కావడం లేదని స్థానిక నేతలు ఎస్‌టీ చైర్మన్‌ కుంభా రవిబాబుకు వివరించారు. ఇంటర్‌ విద్యార్థుల బోధనకు ఇంకా అధ్యాపకులనే నియమించలేదని, హైస్కూల్‌ టీచర్స్‌ అవకాశం ఉన్నప్పుడు బోధిస్తున్నారని, స్సెషల్‌ ఆఫీసర్‌ లేరని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నింటిపై ప్రస్తుతం విధుల్లో ఉన్న టీచర్స్‌ను అడిగి తెలుసుకున్న చైర్మన్‌ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రవిబాబు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు, సీఐ జేడీ బాబు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-28T06:06:24+05:30 IST