అదానీకి గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2021-10-29T06:20:11+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గం గురువారం విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
డేలా సెంటర్ ఏర్పాటుకోసం మధురవాడలో 130 ఎకరాలు కేటాయింపు
అన్నవరంలో ఒబెరాయ్ రిసార్టులు
భీమిలిలో మరో రూ.350 కోట్లతో పర్యాటక ప్రాజెక్టు
శిల్పారామం మరింత అభివృద్ధి
తాజ్ వరుణ్‌బీచ్‌కు రాయితీలు
శారదా పీఠానికి 15 ఎకరాలు
మంత్రివర్గం నిర్ణయాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర మంత్రివర్గం గురువారం విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రూపునకు డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం మధురవాడ సర్వే నంబరు 409లో 130 ఎకరాలు కేటాయించింది. మూడేళ్లలో అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టులో అదానీ రూ.14,634 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, 24,990 మందికి ఉపాధి లభించనున్నదని వెల్లడించింది.
- భీమిలి మండలం అన్నవరంలో సముద్ర తీరాన రిసార్ట్‌ల నిర్మాణానికి అవసరమైన భూములు ఓబెరాయ్ గ్రూపునకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
- భీమిలి మండలంలోనే మరో రూ.350 కోట్లతో పర్యాటక ప్రాజెక్టు రానుంది. ఈ నిధులతో 7 స్టార్ హోటల్ నిర్మించి, 5,500 మందికి ఉపాధి కల్పించనున్నట్టు మంత్రివర్గ సమావేశం వెల్లడించింది.
- మధురవాడ శిల్పారామంలో ఇంకో పర్యాటక ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెరగుతాయి.
- విశాఖపట్నంలో తాజ్ హోటల్‌ను గతంలో వరుణ్ గ్రూపు కొనుగోలు చేసింది. దీనిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి రాయితీలు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా కొన్నింటికి ఆమోదం లభించింది. ఈ మేరకు అక్కడ సర్వీసు అపార్ట్‌మెంట్, స్టార్ హోటల్ వంటివి రానున్నాయి.
- చినముషిడివాడలోని శారదా పీఠానికి విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో 15 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి మార్కెట్ రేటు వసూలు చేయనున్నారు.