‘స్థానిక’ ఉప ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-11-02T06:29:18+05:30 IST

స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో ఖాళీగా వున్న పలు పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది.

‘స్థానిక’ ఉప ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

రేపు నోటిఫికేషన్‌ విడుదల

5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

ఐదు సర్పంచ్‌ పదవులు, 76 వార్డు పదవులకు 14న పోలింగ్‌

ఆనందపురం జడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీలకు 16న ఎన్నికలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో ఖాళీగా వున్న పలు పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆనందపురం జడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీలు, ఆరు పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు, 76 వార్డులకు ఎన్నికల నిర్వహణ కోసం మూడో తేదీన నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఆ రోజు నుంచి ఐదో తేదీ వరకు నామిషన్లు స్వీకరిస్తారు. ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏడో తేదీన అభ్యంతరాలను స్వీకరించి, ఎనిమిదో తేదీన వాటిని పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. అనంతరం పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను వెల్లడిస్తారు. సర్పంచులు, వార్డు సభ్యులకు ఈ నెల 14న, జడ్పీటీసీ/ఎంపీటీసీలకు 16వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 


ఎన్నికలు జరిగే స్థానాలు...

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ తరువాత కొన్నిచోట్ల అభ్యర్థులు చనిపోవడం, గెలిచిన అభ్యర్థుల్లో కొంతమంది మృతిచెందడం వంటి కారణాలతో ఖాళీగా వున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆనందపురం జడ్పీటీసీ పదవికి నామినేషన్‌ దాఖలు తరువాత టీడీపీ అభ్యర్థి టి.ఆదినారాయణ మృతిచెందారు. అదే విధంగా కె.కోటపాడు మండలం దాలివలస ఎంపీటీసీలో వైసీపీ అభ్యర్థి, నక్కపల్లి మండలం జానకయ్యపేట ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి మృతిచెందారు. తాజా నోటిఫికేషన్‌ మేరకు ఆనందపురం జడ్పీటీసీ పదవికి టీడీపీ, దాలివలస ఎంపీటీసీకి వైసీపీ, జానకయ్యపేట ఎంపీటీసీకి టీడీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరగని వంతర్లపాలెం (వి.మాడుగుల), నాగులాపల్లి-2 (మునగపాక), భీమబోయినపాలెం (మాకవరపాలెం), దిబ్బపాలెం-3 (అచ్యుతాపురం) ఎంపీటీసీలకు నామినేషన్లు స్వీకరిస్తారు. బ్యాలెట్‌ బాక్సుల్లో నీరు చేరడంతో ఓట్ల లెక్కింపు జరగని గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ పరిధిలోని 29, 30 నంబర్ల పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ కొత్తగా నామినేషన్లు స్వీకరించరు. కాగా మునిసిపల్‌ పరిపాలనా శాఖ ఆదేశాలతో గతంలో భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా ఆ శాఖ నుంచి అభ్యంతరం లేకపోవడంతో సర్పంచ్‌తోపాటు పది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. కొవిడ్‌-19తోపాటు ఇతర కారణాలతో సర్పంచ్‌లు మృతిచెందిన ఆర్లి (కె.కోటపాడు), ఉపమాక (నక్కపల్లి), బాలారం (కొయ్యూరు), గిన్నెలకోట (పెదబయలు), జర్రెల (ముంచంగిపుట్టు) పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. వీటితోపాటు 66 వార్డు పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు.


రేపటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలు

ఆనందపురం జడ్పీటీసీకి ఎన్నికలు నిర్వహిస్తున్నందున బుధవారం నుంచి విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. అలాగే ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నందున కె.కోటపాడు, నక్కపల్లి, వి.మాడుగుల, మునగపాక, మాకవరపాలెం, అచ్యుతాపురం మండలాల పరిధిలో కూడా ఎన్నికల కోడ్‌ అమలులోకి రానున్నది. అలాగే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్న పంచాయతీ పరిఽధిలో కోడ్‌ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-02T06:29:18+05:30 IST