గ్రామాల్లో ఇళ్ల కొలత!

ABN , First Publish Date - 2021-08-20T05:52:27+05:30 IST

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మాదిరిగానే గ్రామ పంచాయతీల్లో కూడా ఆస్తి విలువ ఆధారంగా ఇళ్ల పన్నులు వసూలు చేయబోతున్నారా?, ఖాళీగా వున్న ఇళ్ల స్థలాలకు పన్ను విధించను న్నారా?... ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహి స్తున్న ఇళ్ల సర్వే పనులు చూస్తే ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామాల్లో ఇళ్ల కొలత!

ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే యోచనలో ప్రభుత్వం?

ఇప్పటికే కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అమలు

పంచాయతీల్లో మొదలైన సర్వే

నివాసాలతో ఖాళీ స్థలాలకు సైతం కొలతలు

42 కాలమ్స్‌తో ఉన్న పట్టికలో సమాచారం

ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌


కొయ్యూరు, ఆగస్టు 19: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మాదిరిగానే గ్రామ పంచాయతీల్లో కూడా ఆస్తి విలువ ఆధారంగా ఇళ్ల పన్నులు వసూలు చేయబోతున్నారా?, ఖాళీగా వున్న ఇళ్ల స్థలాలకు పన్ను విధించను న్నారా?... ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహి స్తున్న ఇళ్ల సర్వే పనులు చూస్తే ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఇంతవరకు వరకు అద్దె విలువ ఆధారిత ఇళ్ల పన్నుల స్థానంలో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో జీవీఎంసీతోపాటు నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నుల విధింపునకు కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానాలను ప్రవేశపెట్టగా, విపక్షాలు వ్యతిరేకించాయి. అధికార పార్టీకి మెజారిటీ వుండడంతో ఆమోదం లభించింది. ఆ ప్రకారం ఆస్తి పన్నులు భారీగా పెరగనున్నాయి. కొత్త పన్నుల విధానాన్ని ఈ ఏడాది (2021-21) నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరాలు, పట్టణాల్లో పన్నుల బాదుడు ప్రక్రియ పూర్తికావడంతో...ప్రభుత్వం ఇక గ్రామాలపై దృష్టిసారించిందేమోననే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కొలతలు వేసి, కొత్తగా అసెస్‌మెంట్‌ నంబర్లు జారీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ పనిని గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. గ్రామ వలంటీరు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంటు, డిజిటల్‌ అసిస్టెంటు కలిసి తమ పరిధిలో ప్రతి నివాసానికి వెళ్లి ఇంటి పొడవు, వెడల్పు కొలతలు తీస్తున్నారు. మొత్తం స్థలం ఎంత?, ఇంటి నిర్మాణం జరిగిన స్థలం ఎంత? ప్లింత్‌ ఏరియా ఎంత?, ఎన్ని సంవత్సరాల క్రితం ఇంటిని నిర్మించారు?, ఏ కేటగిరీ ఇల్లు? (శ్లాబ్‌ భవనం, పెంకుటిల్లు, రేకుల షెడ్డు, పూరిల్లు), తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో 42 కాలమ్స్‌తో వున్న పట్టికలో సమాచారాన్ని పొందుపరిచి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ వివరాల ప్రకారం రానున్న రోజుల్లో ఆస్తి విలువ ఆధారంగా ప్రభుత్వం పన్నులు విధిస్తుందని అధికార వర్గాల సమాచారం. అంతేకాక పట్టణాల్లో మాదిరిగానే గ్రామీణులు సైతం ఇళ్ల పన్నులను ఆన్‌లైన్‌లో కూడా చెల్లించేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ని రూపొందిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2021-08-20T05:52:27+05:30 IST